చినుకు పడితే చిత్తడే.! | - | Sakshi
Sakshi News home page

చినుకు పడితే చిత్తడే.!

Jun 14 2026 11:43 AM | Updated on Jun 14 2026 11:43 AM

నీరు నిలిచిన రోడ్డు ముందు కేవీటీనగర్‌ వాసులు

తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో చేరిన వాన నీరు

ఏపీఎంసీలో బురదలోనే ఆకుకూరల విక్రయం

సాక్షి,బళ్లారి: నగర వాసులకు కూరగాయలు, ఆకుకూరలు తదితర నిత్యావసరాలు అందించే, నిత్యం పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలు జరిగే ఏపీఎంసీ యార్డు మరింత అధ్వాన్నంగా మారింది. వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడ రైతులు, వ్యాపారులు, వినియోగదారులు నరకయాతన అనుభవిస్తారు. బళ్లారి జిల్లాతో పాటు చుట్టుపక్కల వివిధ ప్రాంతాల నుంచి రైతులు పెద్ద ఎత్తున కూరగాయలను ఇక్కడ తీసుకుని వచ్చి అమ్మకాలు సాగిస్తుంటారు. కూరగాయలతో పాటు ఆయా సీజన్లలో పండే పండ్లను కూడా ఇక్కడకు తీసుకు వచ్చి రైతులు నేరుగా విక్రయిస్తారు. జిల్లాతో పాటు పొరుగున ఉన్న చిత్రదుర్గ, విజయనగర, కర్నూలు, అనంతపురం తదితర జిల్లాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి కూరగాయలను విక్రయిస్తుంటారు.

బురదలోనే కూరగాయల అమ్మకాలు

పెద్ద స్థాయిలో వ్యాపార లావాదేవీలు జరిగే ఏపీఎంసీ మార్కెట్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయకపోవడంతో పలు రోడ్లు బురదమయంగా మారాయి. వర్షాకాలంలో రైతులు, వ్యాపారులు బురదలోనే కూరగాయలను విక్రయిస్తుండటం సర్వసాధారణంగా మారింది. శుక్రవారం కురిసిన భారీ వర్షానికి శనివారం ఉదయం బురదనీటిలోనే కూరగాయలు, పండ్లు విక్రయించడం కనిపించింది. దీంతో వినియోగదారులు, రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక అధికారులు, పాలకులకు ఎన్నిసార్లు తమ సమస్యలను చెప్పినా పట్టించుకోవడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వర్షాకాలం వచ్చిందంటే నగరంలో పలు కాలనీలు నీటి గుంటలు, చెరువుల్లా మారడం పరిపాటి అయింది. దీంతో ఆయా కాలనీల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

భారీ వర్షంతో రోడ్లు జలమయం

ఈ ఏడాది వర్షాకాలం మొదలైనప్పటి నుంచి వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నగరంలో బీభత్సంగా వర్షం కురవడంతో రోడ్లు జలమయమయ్యాయి. అనంతపురం రోడ్డులోని కేవీటీ నగర్‌ సెకండ్‌ క్రాస్‌ మళ్లీ జలమయంగా మారింది. గత 15 రోజుల నుంచి ఈ కాలనీ వాసులు వాననీటిలోనే తిరుగుతున్నారు. ఇలా ఈ ఒక్క కాలనీ బురద, వాన నీటిలో ఉందనుకుంటే పొరపాటు. నగరంలో ఎన్నో రోడ్లు, లోతట్లు ప్రాంతాలు నీట మునుగుతాయి. చివరకు ప్రభుత్వ కార్యాలయాలు కూడా చెరువులను తలపిస్తున్నాయంటే అధికారులు, పాలకులు పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా కురిసిన భారీ వర్షం వల్ల తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణ చెరువును తలపిస్తోంది. ఈ కార్యాలయం ఆవరణలో పోలీసు స్టేషన్‌, వ్యవసాయ శాఖ కార్యాలయంతో పాటు వీఏఓ, ఆర్‌ఐ తదితర అధికారుల కార్యాలయాల ఆవరణలు కూడా వర్షం వస్తే చెరువులను తలపిస్తున్నాయి. వర్షాకాలంలో జలమయం అవుతున్న లోతట్టు ప్రాంతాలను గుర్తించి శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని నగర వాసులు కోరుతున్నారు.

అస్తవ్యస్తంగా ఏపీఎంసీ యార్డు

వినియోగదారులకు నరకయాతన

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement