సాక్షి,బళ్లారి: నగరంలో గత కొన్నేళ్లుగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన బడా నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ స్థలాలను కబ్జాలు చేసిన నేపథ్యంలో ఆక్రమణల తొలగింపుపై అధికారులు గట్టి చర్యలు చేపడుతున్నారు. ఆ పార్టీ, ఈ పార్టీ రెండూ దొందూ దొందే అన్న చందంగా రెండు ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు తాము అఽధికారంలో ఉన్నాం కదా, తమను ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో ప్రభుత్వ స్థలాలను ఎకరాలకు ఎకరాలు కబ్జాలు చేసి, ఏకంగా ఇళ్ల స్థలాలను కూడా విక్రయించిన మహానుభావులు ఉండటంతో అలాంటి వాటిని గుర్తించి అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు.
కబ్జాల ఖాళీపై జనం ప్రశంసలు
కబ్జా చేసిన ప్రభుత్వ స్థలాలను గుర్తించి రెవెన్యూ, పోలీసు, సర్వే శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం మూకుమ్మడిగా దాడి చేసి కబ్జాలను తొలగిస్తుండటంతో అధికారులపై జనం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఆక్రమణలను తొలగించిన జిల్లా యంత్రాంగం తాజాగా శనివారం నగర శివార్లలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడు ప్రభుత్వ పొరంబోకు భూమిని ఆక్రమించుకుని కాంపౌండ్ వాల్ నిర్మించుకుని, ఫాం హౌస్ కట్టించుకుని దర్జాగా కాలం గడుపుతున్న తరుణంలో అధికారులు మూకుమ్మడిగా దాడి చేశారు. రెవెన్యూ, పోలీసు, సర్వే అధికారులు జేసీబీలు, ట్రాక్టర్లతో వెళ్లి ఆక్రమణలు ఖాళీ చేశారు.
కబ్జాలపై మెరుపు దాడులు
నగర శివార్లలోని ఆలదహళ్లి సర్వే నంబర్ 38–ఏ లో 3.28 ఎకరాల స్థలం ఆక్రమించుకుని అందులో కాంపౌండ్ వాల్ నిర్మించుకుని తన స్వాధీనంలో ఉంచుకుని అనుభవిస్తున్న విషయం వెలుగులోకి రావడంతో అధికారులు సమగ్ర తనిఖీ చేపట్టి ఆక్రమణలు తొలగించారు. ఏడీసీ మహమ్మద్ జుబేర, డీడీఎల్‌ఆర్ ప్రమోద్, ఏడీఎల్‌ఆర్ బళ్లారప్ప, తహసీల్దార్, ఆర్‌ఐలు, వీఏఓ నరేంద్ర తదితరులు మెరుపుదాడి చేసి ఆక్రమణలు తొలగించి ఆ స్థలంలో ఇది ప్రభుత్వ స్థలం అని బోర్డు పెట్టారు. ఈ భూమిని ఎవరూ ఆక్రమించుకునేందుకు వీలు లేదంటూ ఆక్రమణదారులపై క్రిమినల్ కేసు కూడా పెట్టారు. ఈ ఘటనతో నగరంలో ఆక్రమణదారుల గుండెల్లో గుబులు పుట్టింది.
కొనసాగుతున్న పకడ్బందీ చర్యలు
కార్యాచరణలో పాల్గొన్న అధికారులు


