సాక్షి, బెంగళూరు: బెంగళూరు ట్రాఫిక్ సమస్య అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. విపరీతమైన వాహన రద్దీ, గందరగోళంపై తరచూ విమర్శలు వస్తుంటాయి. అదే రీతిలో కొందరు వాహనదారులు ఇష్టానుసారం వెళ్తుంటారు. ఇలాంటి వారిని కట్టడి చేయడానికి నగర ట్రాఫిక్ పోలీసులు ఆధునిక టెక్నాలజీ సాయం తీసుకున్నారు. బైక్‌పై హెల్మెట్ లేకుండా వెళ్లినా, ట్రిపుల్ రైడింగ్ చేసినా, సిగ్నల్ జంప్, కారులో సీటు బెల్టు పెట్టుకోకున్నా.. ఇలాంటి అతిక్రమణలకు పాల్పడితే కెమెరాలు గుర్తించి చలాన్లు నమోదు చేస్తున్నాయి.
కోటికి పైగా వాహనాలు
బెంగళూరులో కోటికి పైగా వాహనాలున్నాయి. రోడ్ల విస్తీర్ణం ఆ స్థాయిలో లేదు. దీంతో రోజూ వందలాది ఉల్లంఘనలు జరుగుతుంటాయి. దీనివల్ల ప్రమాదాలూ తప్పడం లేదు. వాటి నియంత్రణకు ఆధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తుండగా, ఉల్లంఘనుల సంఖ్య నెమ్మదిగా తగ్గుముఖం పడుతోందని తెలిసింది. బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల వార్షిక గణాంకాలు ఇదే చెబుతున్నాయి. ముఖ్యంగా త్రిబుల్ రైడింగ్ కేసులు 2024లో గరిష్ట స్థాయిలో ఉండగా, ఇప్పుడు చాలావరకు తగ్గిపోయాయి.
సగానికి నియంత్రణ
18 నుంచి 35 ఏళ్లలోపు యువకులు అధికంగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ఈ ఉల్లంఘనలు దాదాపు ఇప్పుడు సగానికి పడిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఏఐ ఆధారిత కెమెరాల ఏర్పాటు, అవగాహన ర్యాలీలు, తనిఖీల వల్ల ఈ ఫలితాలు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. అధికంగా కాలేజీలు, పీజీ హాస్టళ్లు, పబ్‌లు ఉండే ప్రాంతాల్లో యువకులు ఎక్కువగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు చెప్పారు.
ఈ ప్రాంతాల్లో తగ్గాలి
బీటీఏం లేఔట్, కోరమంగళ తదితర హాట్ స్పాట్లలో అర్ధరాత్రిల్లో ట్రాఫిక్‌ను నియంత్రించడం పోలీసులకు పెద్ద సవాలుగా ఉండేది. పోకిరీలు ప్రమాదకర త్రిబుల్‌రైడింగ్, బైక్ స్టంట్లు చేస్తారు. మద్యం తాగి డ్రైవింగ్ సరేసరి. రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటల మధ్య రోడ్డు నిబంధనలు ఉల్లంఘనలు ఎక్కువగా జరుగుతున్నాయి. బీటీఎం లేఔట్, హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్, కోరమంగళ, ఇందిరానగర, ఎంజీ రోడ్లపై నిబంధనల బేఖాతరు ఎక్కువగా సాగుతోంది.
ఎంజీ రోడ్డులో కెమెరాల బిగింపు
బెంగళూరులో సత్ఫలితాలు
తగ్గిన సిగ్నల్ ఉల్లంఘనలు


