మండ్య: మండ్య జిల్లాలోని మలవల్లి తాలూకాలోని తలగవాడి గ్రామం సమీపంలో చిరుతపులి కనిపించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గ్రామంలోని రాకరి గ్రాడ్యుయేట్ స్కూల్ సమీపంలో, నిర్మానుష్య ప్రదేశంలో అది తిరుగుతోంది. బుధవారం రాత్రి, గ్రామానికి చెందిన టి.కె.మను, టి.ఎస్.అభిషేక్ గౌడ కారులో వెళ్తుండగా రోడ్డు దాటుతున్న చిరుతని చూసి భయపడ్డారు. ఫోన్‌లో దానిని రికార్డు చేశారు. గత వారం కూడా అదే రోడ్డుపై చిరుతపులి కనిపించింది. గత కొన్ని నెలలుగా, ఐదు లేదా ఆరు చిరుత పులులు గ్రామం చుట్టూ తిరుగుతూ, 10కి పైగా పెంపుడు జంతువులను చంపాయి. చిరుతల భయంతో ఒంటరిగా మహిళలు, పిల్లలు బయటకు వెళ్లలేకపోతున్నారని గ్రామస్తులు తెలిపారు. అటవీ సిబ్బంది వెంటనే చిరుతలను బంధించి భద్రత కల్పించాలని కోరారు.


