హొసపేటె: విజయనగర జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో బ్యాంకు సిబ్బంది, ఏటీఎం యాజమాన్యం, ఏటీఎంల్లో డబ్బు నింపే ఏజెన్సీల అధికారులు, ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకు, పోలీసు అధికారులతో బుధవారం నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ జాహ్నవి మాట్లాడుతూ నగరంలో అనేక ఏటీఎంల వద్ద సరిగా సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతో ఇటీవల రైల్వే స్టేషన్ రహదారిలోని కనకదాసు సర్కిల్ వద్ద ఏటీఎంలో దుండగులు చోరీ యత్నానికి పాల్పడ్డారన్నారు. బ్యాంక్ ఏటీఎంల్లో డబ్బులు నింపే ఏజెన్సీల అధికారులు, బ్యాంక్ లావాదేవీల విషయంలో తప్పనిసరిగా నియమాలను పాటించాలన్నారు. బ్యాంకు ఏటీఎంల్లో డబ్బు నింపడం, తరలించడంపై వివరాలు తెలుసుకున్నారు. అందరూ ఎలా పని చేస్తున్నారో పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సమావేశంలో 30 బ్యాంకుల అధికారులు, లీడ్ బ్యాంక్ జిల్లా స్థాయి అధికారి వీరేంద్రకుమార్, ఏఎస్పీ మంజునాథ్, డీఎస్పీ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.


