మైసూరు: ప్రధానిగా నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసిన నేపథ్యంలో బుధవారం మైసూరులో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. కేఆర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీవత్స, కార్యకర్తలు అగ్రహార సర్కిల్ నుంచి గణపతి దేవస్థానం వరకు జాతా నిర్వహించారు. మోదీ పేరిట ఆలయంలో అర్చనలు చేయించారు. చంద్రమౌళేశ్వరి దేవస్థానంలో ఎంపీ యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయర్ ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాని సుదీర్ఘ పాలనలో దేశం మరింత ప్రగతి సాధించాలని ప్రార్థించారు. పార్టీ నేతలు ఎల్.నాగేంద్ర, సినీ నటుడు ఎస్.జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
ఊరికి వెళ్తే.. రూ.30 లక్షల నగలు మాయం
దొడ్డబళ్లాపురం: ఇంటి తాళం పగలగొట్టిన దొంగలు లోపలకు జొరబడి బీరువాలో ఉన్న రూ.30 లక్షల విలువైన బంగారు నగలు, వెండి సొత్తును దోచుకున్నారు. బెంగళూరు కదిరేనహళ్లిలో ఈ ఘటన జరిగింది. బాధితుడు అరుణ్‌కుమార్ రెండు రోజుల క్రితం ఇంటికి తాళం వేసుకుని కుటుంబ సమేతంగా బంధువుల ఊరికి వెళ్లాడు. గమనించిన దొంగలు చొరబడి బీరువాను పగలగొట్టి అందులోని బంగారు నగలు, వెండి వస్తువులు, పట్టుచీరలు మూటగట్టుకుని పరారయ్యారు. బుధవారంనాడు ఇంటికి తిరిగి వచ్చిన అరుణ్ లబోదిబోమంటూ మాదనాయకనహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మైషుగర్‌ను విస్తరించాలి
మండ్య: మైషుగర్ కర్మాగారం పునశ్చేతనానికి అవసరమైన బాయ్లింగ్ హౌస్, డిస్టిలరీ, విద్యుత్ యూనిట్లు సంపూర్ణ సామర్థ్యంతో పనిచేయాలని, రాష్ట్రంలో ఆదర్శ చక్కెర కర్మాగారంగా మైషుగర్‌ను ప్రకటించాలని పోరాట సమితి నేతలు డిమాండ్ చేశారు. బుధవారం నగరంలోని రైతు సభాంగణం ఆవరణలో జాతీయ కవి కువెంపు ప్రతిమ ఎదుట నిరసన తెలిపారు. ఈ నెల 15 నుంచి చేపట్టిన రైతు జనాందోళన పోస్టర్‌ను విడుదల చేసి మాట్లాడారు. కర్మాగారాన్ని పూర్తిస్థాయిలో నిర్వహిస్తే ఎంతో మంది రైతులకు అనుకూలం కావడంతో పాటు సుమారు వెయ్యి మందికి పైగా స్థానికులకు ఉపాధి లభిస్తుందన్నారు. రైతు జనాందోళన జాతా ఈనెల 15 నుంచి మైషుగర్ పరిధిలోని 110 గ్రామాల్లో సంచరించి చైతన్యపరుస్తుందన్నారు. రైతు సంఘం ఉపాధ్యక్షుడు శివళ్లి చంద్రు, కొమ్మేరహళ్లి ఆనంద్, హెచ్‌డీ జయరాం పాల్గొన్నారు.
పెద్ద పులి పట్టివేత
మైసూరు: జిల్లాలోని హుణసూరు తాలూకాలోని తట్టెకెరె వద్ద ఉన్న కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే హెచ్‌పీ మంజునాథ్‌కు చెందిన తోటలో బోనులో పులి పట్టుబడింది. గత నెల రోజులుగా తట్టెకెరె గ్రామంతో పాటు చుట్టుపక్కల పల్లెల ప్రజలు పులి సంచారంతో బిక్కుబిక్కుమంటున్నారు. తరచూ ఆవులు, ఎద్దులను వేటాడి చంపుతోంది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు 10 సీసీ కెమెరాలను అమర్చి, దాని కదలికలపై నిఘా పెట్టి బోనులను కూడా ఏర్పాటు చేశారు. తోటలోని బోనులో పులి బందీ అయింది. పులిని అక్కడి నుంచి తరలించారు. కాగా రెండు పులులు ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు. మరొక పులి ఉంటే దానిని కూడా పట్టుకుంటామని అటవీ అధికారులు తెలిపారు.
ప్రైవేటు స్కూల్‌లో విద్యార్థి ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: విద్యాబుద్ధులు నేర్పాల్సిన హెడ్‌మాస్టర్ కిరాతకునిలా వేధించడంతో ఓ విద్యార్థి ప్రాణం గాల్లో కలిసింది. ప్రైవేటు స్కూల్‌లో 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బీదర్ నగరంలోని ప్రతాప్ నగరలో చోటుచేసుకుంది. 10వ తరగతి చదువుతున్న సమీర్ (16) బుధవారం ఉదయం స్కూల్‌కి వెళ్లిన కొంతసేపటికే పాఠశాల 4వ అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హెచ్‌ఎం, సిబ్బంది ఈ విషయాన్ని పోలీసులకు, తల్లిదండ్రులకు చెప్పకుండా మృతదేహాన్ని బ్రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పలు కారణాలతో స్కూల్ హెడ్ మాస్టర్ వేధిస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తెలిసింది. బీదర్ న్యూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.


