తుపాకీతో కాల్చుకుని మహిళ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

తుపాకీతో కాల్చుకుని మహిళ ఆత్మహత్య

Jun 11 2026 7:59 AM | Updated on Jun 11 2026 7:59 AM

యశవంతపుర: ఇంట్లో రివాల్వర్‌తో కాల్చుకుని మహిళ అనుమానాస్పద రీతిలో చనిపోయిన ఘటన చిక్కమగళూరు నగరంలోని హాళేనహళ్లిలో జరిగింది. వ్యాపారవేత్త రాజేంద్ర భార్య సుమ (55) గృహిణి. బుధవారం ఇంట్లో లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌తో ఆమె కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనకు ముందు డెత్‌నోట్‌ రాసి పెట్టారు. ఘటన జరిగిన సమయంలో ఆమె భర్త బయటకు వెళ్లాడు, కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు. తుపాకీ కాల్పుల శబ్ధాలు విని స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వచ్చి చూసేసరికి ఆమె రక్తపు మడుగులో చనిపోయి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

బెయిలు రద్దు అర్జీ తిరస్కృతి

యశవంతపుర: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో విడుదలైన ఐదుమంది నిందితుల బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసుల న్యాయవాది దాఖలు చేసిన అర్జీని హైకోర్టు తిరస్కరించింది. పవన్‌, ధనరాజు, రాఘవేంద్ర, వినయ్‌, నందీశ్‌లకు పెద్ద ఊరట కలిగింది. ఐదుగురికీ గతంలో కింది కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని ప్రాసిక్యూషన్‌ కోరింది. న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.రాచయ్య విచారించి రద్దు చేశారు.

దర్శన్‌ భార్యకు వేధింపులు

దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో పరప్పన సెంట్రల్‌ జైలులో రిమాండులో ఉన్న ప్రముఖ నటుడు దర్శన్‌ భార్య విజయలక్ష్మిని సోషల్‌ మీడియా ద్వారా ఆకతాయిలు వేధిస్తున్నారు. ఆమెను కించపరుస్తూ అశ్లీల మెసేజ్‌లు పెడుతున్నారు. భర్త జైల్లో ఉంటే ఈమె మాత్రం కార్లలో షికార్లు చేస్తూ ఎంజాయ్‌ చేస్తోందని నానా రకాలుగా నిందిస్తున్నారు. దీంతో విసిగిపోయిన విజయలక్ష్మి బెంగళూరు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేరళ ఉత్సవాలకు రండి ప్లీజ్‌

కన్నడిగులకు కేరళ డీఐజీ వేడుకోలు

యశవంతపుర: కేరళలో కణ్ణూరు జిల్లాలోని కొట్టియూరు దేవస్థానంలో జరిగే వైశాఖ మహోత్సవంలో పాల్గొనాలని కన్నడ భక్తులకు కణ్ణూరు డీఐజీ కన్నడంలో విన్నవించారు. ఇన్‌స్టాలో ఆ వీడియోను పోస్ట్‌ చేశారు. గత సంవత్సరం కణ్ణూరులో వైశాఖ మహోత్సవం రోజున గొడవలు జరిగాయి. దీనివల్ల కన్నడ భక్తులు ఇబ్బందులు పడ్డారు. చాలామంది ఈ ఏడాది వెళ్లాలా, వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు. దీనివల్ల అక్కడ పర్యాటకానికి గండి పడే ప్రమాదం ఉన్నందున డీఐజీ యతీశ్‌ చంద్ర మాట్లాడుతూ ఈసారి అలాంటి ఘటనలు జరక్కుండా కఠిన చర్యలు తీసుకొంటామని తెలిపారు. దేవస్థానం చుట్టుపక్కల భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మీ జతలో పోలీసులం ఉంటాం, ఎవరూ భయపడవలసిన పని లేదంటూ భరోసా ఇచ్చారు.

ఆలయ సిబ్బంది దౌర్జన్యం

గతేడాది వైశాఖ మహోత్సవంలో పాల్గొన్న భక్తులపై దేవస్థానం సిబ్బంది దౌర్జన్యంగా ప్రవర్తించారు. దీనికి నిరసనగా కొందరు కన్నడ భక్తులు ఈసారి వైశాఖ మహోత్సవాలకు రాబోమంటూ వీడియోలు తీసి నెట్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో డీఐజీ కన్నడిగులను వేడుకోవాల్సి వచ్చింది.

దుస్థితిలో శివమొగ్గ ఎయిర్‌పోర్టు

శివమొగ్గ: ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన శివమొగ్గ విమానాశ్రయం రాష్ట్ర ప్రభుత్వం నిర్వాకం కారణంగా విమానాల రాకపోకలకు ఇబ్బందిగా మారిందని ఎంపీ బీవై రాఘవేంద్ర ఆరోపించారు. శివమొగ్గ విమానాశ్రయంలో రాత్రివేళ ల్యాండింగ్‌ కావడానికి సమస్య ఉందని, అదనపు స్థలం కావాలని అటవీశాఖను కోరినట్లు తెలిపారు. నైట్‌ ల్యాండింగ్‌ సౌకర్యానికి కావాల్సింది రూ. 7 కోట్లేనని, ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. అందుకే మూడు నెలలుగా స్పైస్‌జెట్‌ విమానాలను నిలిపివేసిందన్నారు. మరోవైపు 4,399 రోజుల పాటు ప్రధాని హోదాలో రికార్డు సృష్టించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ నేతగా మారారని కొనియాడారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement