మేలుకోటె ఆలయంలో ఇంటి దొంగలు | - | Sakshi
Sakshi News home page

మేలుకోటె ఆలయంలో ఇంటి దొంగలు

Jun 11 2026 7:59 AM | Updated on Jun 11 2026 7:59 AM

మండ్య: జిల్లాలోని ప్రఖ్యాత మేలుకోటె యోగ నరసింహస్వామి దేవస్థానంలో ఇంటి దొంగల నిర్వాకం బయటపడింది. అర్చకుడు నారాయణభట్టతో పాటు ఆరుమందిపై మేలుకోటె పోలీసు స్టేషన్‌లో దొంగతనం కేసు దాఖలైంది. చెలువనారాయణ స్వామి దేవాలయ ఈఓ శీలా మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ దాఖలైంది. ఆలయ రక్షకుడు శ్రీధర్‌, అర్చకుడు నారాయణ భట్ట, పరిచారకుడు తిరువేంగడాచార్‌, కాపలాదారులు ఎంబీ గంగాధర, బసవరాజు, కోశాధికారి కస్తూరి శ్రీనివాసన్‌పై ఐపీసీ సెక్షన్‌ 306 కింద ఎఫ్‌ఐఆర్‌ దాఖలు అయింది. ఆలయ హుండీలోని బంగారం, వెండి, కానుక డబ్బులు, సీసీ కెమెరాల ధ్వంసం జరిగినట్లు శీలా ఫిర్యాదు చేశారు. పోలీసులు యోగానరసింహస్వామి బెట్టకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

రహస్య కెమెరాలలో..

చాలాకాలంగా హుండీలో భక్తులు వేసిన బంగారం, వెండి, నగదు చోరీ అవుతున్నట్లు తనకు అనుమానంగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే దొంగలను గుర్తించేందుకు గర్భగుడి, ఇతర చోట్ల రహస్య కెమెరాలను ఏర్పాటు చేసినట్లు శీలా తెలిపారు. అయితే జనవరి 5న మధ్యాహ్నం ఆ కెమెరాలను నాశనం చేసి డీవీఆర్‌ను కాల్చివేసినట్లు తెలిసిందన్నారు. ఆ రోజు విధుల్లో ఉన్న అందరికి నోటీసులు జారీ చేసినట్లు, ఆ ఆరు మందిపై ఫిర్యాదు చేసినట్లు శీలా తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత ఆలయంలో ఇలాంటి అపచారాలు జరగడంపై భక్తజనంలో తీవ్ర ఆదుర్దా నెలకొంది.

హుండీలలో డబ్బు, బంగారం చోరీ

ఈఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement