హొసపేటె: భారతదేశం గర్వించదగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనను పురస్కరించుకుని బుధవారం నగరంలోని నెహ్రూ కాలనీలో ఉన్న సన్నక్కి వీరభద్రేశ్వర ఆలయంలో బీజేపీ ఆధ్వర్యంలో సన్నక్కి వీరభద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి విద్వాన్ అశోక్ జీరె, సాలి సిద్దయ్య స్వామి, ఆర్.కొట్రేష్, వీ.రాధ, గొగ్గ చెన్నబసవరాజు, శశిధర స్వామి తదితరులు పాల్గొన్నారు.
లారీ దూసుకెళ్లి
బైకిస్టు మృతి
హుబ్లీ: జాతీయ రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్ చోదకుడు మృతి చెందాడు. భరత్ నాగరాజ్(21) మృతుడు. భరత్ బైక్‌లో బమ్మిగట్టి క్రాస్ నుంచి ఏపీఎంసీ సమీపంలోని కాంప్లెక్స్‌కు వెళుతుండగా బైక్ ఆవును ఢీకొన్న తర్వాత లారీని ఢీకొంది. గాయపడి రోడ్డు మీద పడ్డ భరత్ భుజం మీదుగా మరో లారీ వెళ్లింది. భరత్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందాడని కలఘటిగి పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.
మహిళ బలవన్మరణం
మరో ఘటనలో షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి నష్టపోయిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. స్థానిక కొత్త మేదారవీధికి చెందిన వాసంతి కదం (32) అనే మహిళ కొన్నేళ్ల నుంచి ట్రేడ్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేవారు. అయితే ఇటీవల తీవ్రంగా నష్టం రావడంతో తమ ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు ఆమె తల్లి హుబ్లీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ట్రక్కు బోల్తా.. డ్రైవర్ సురక్షితం
హొసపేటె: కొప్పళ తాలూకా మునిరాబాద్ సమీపంలో జాతీయ రహదారి– 63పై లోడ్ లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ చేతన్(25)కు స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు అతను ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న జాతీయ రహదారుల శాఖ, 112 పోలీసు సిబ్బంది భీమన్న, హనుమంత సహాయక చర్యలు చేపట్టారు. అక్కడ ఏర్పడిన ట్రాఫిక్ జామ్‌ను కొంతసేపటికి పరిష్కరించారు.
నాగేంద్రకు మంత్రి పదవి కోసం ర్యాలీ
బళ్లారిఅర్బన్: మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బీ.నాగేంద్రకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఒత్తిడి చేస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు బుధవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని కాగె పార్క్ నుంచి గడిగి చెన్నప్ప సర్కిల్ వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి డీకే.శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు కాంగ్రెస్ అధిష్ఠానం నాగేంద్రకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సంగనకల్లు విజయకుమార్, వై.శివకుమార్, నాగలకెరె గోవింద్, నాగభూషణ గౌడ, బీఎం.పాటిల్, మల్లికార్జున, మల్లేశ్వరి తదితర అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఓటరు జాబితా సర్వే చేయండి
రాయచూరు రూరల్: ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)కు చర్యలు చేపట్టాలని తహసీల్దార్ సురేష్ వర్మ బీఎల్‌ఓలకు సూచించారు. బుధవారం జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీఎల్‌ఓల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 2.50 లక్షల మందిపై ఓటరు జాబితాల్లో సమీక్షలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. లేకుంటే సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ఈనెల 29 వరకు బీఎల్‌ఓలు ఇంటింటికీ తిరిగి సర్వే చేపట్టాలన్నారు. ముద్రితమైన ఓటరు జాబితాలో ఉన్న లోపాలను ఇంటి యజమానులతో సమీక్షించి సవరించాలన్నారు. సమావేశంలో విద్యాశాఖాధికారులు మల్లికార్జున, ఈరణ్ణ కోస్గి, శరణప్ప, అిసిస్టెంట్ కమిషనర్ హంపణ్ణ సజ్జన్‌లున్నారు.


