రాయచూరు రూరల్: విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పే పాఠశాల విద్యా శాఖ తాలూకా అధికారి(బీఈఓ) కార్యాలయం నగరంలో శిథిలావస్థకు చేరుకుంది. ఈ కార్యాలయం నిర్మించి 50 ఏళ్లు దాటినా మరమ్మతులకు మాత్రం నోచుకోవడం లేదు. కార్యాలయం పైకప్పు పెచ్చులూడి పడుతున్నాయి. ఈ విషయంలో చొరవ చూపాల్సిన ప్రజా ప్రతినిధులు ఏరోజు కూడా ఈ కార్యాలయం వైపు కన్నెత్తి చూడలేదు. జిల్లాధికారి, జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారి, జిల్లా విద్యాశాఖాధికారి(డీడీపీఐ) కూడా కార్యాలయం స్థితిగతుల గురించి ఏనాడూ పరిశీలించిన, పట్టించుకున్న సందర్బాలు లేవు. ఇటీవల కురిసిన వానలకు భవనంపై కప్పుపై నీరు నిలిచి కారడంతో పాటు పెచ్చులూడి కింద పడడంతో సిబ్బంది త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అధికారులు, సిబ్బంది, పనిపై కార్యాలయానికి వచ్చే ఉపాధ్యాయులు ఏ సమయంలో పెచ్చులూడి తమపై పడతాయోననే భయంతో ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని విధులు నిర్వహిస్తున్నారు. తాలూకా విద్యాశాఖాధికారి కార్యాలయం ముందు భాగంలో పైకప్పు పెచ్చులూడి పడ్డాయి. నూతన జిల్లాధికారి కార్యాలయం మినీ విధానసౌధకు తరలి పోగా, నగరసభ కార్యాలయాన్ని పాత జిల్లాధికారి కార్యాలయానికి తరలించారు. కానీ బీఈఓ కార్యాలయాన్ని మాత్రం వేరే చోటకు తరలించడం లేదు. ఈనేపథ్యంలో ఈ సమస్యపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
శిథిలావస్థకు చేరిన బీఈఓ కార్యాలయం
50 ఏళ్లు దాటినా మరమ్మతులు శూన్యం


