సాక్షి,బళ్లారి/హొసపేటె: వేర్వేరు చోట్ల ఏటీఎంల్లో నగదు చోరీలకు పాల్పడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. కొప్పళలో ఏటీఎంలో డబ్బులు దోచుకోడానికి యత్నించిన దుండగులు, ఆ ప్రయత్నం విఫలం కావడంతో చివరకు ఏటీఎంకు నిప్పు పెట్టిన ఘటన బుధవారం వెలుగు చూసింది. వివరాలు.. కొప్పళ నగరంలోని హొసపేటె రోడ్డులో ఉన్న ఏటీఎంలో కొందరు దుండగులు దోపిడీ చేయడానికి విఫలయత్నం చేశారు. ఏటీఎంలోని డబ్బులు దోచుకోవడానికి వీలు కాకపోవడంతో ఏటీఎం యంత్రానికి నిప్పు పెట్టడం కలకలం రేపింది. ఏటీఎంకు నిప్పు పెట్టిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఏటీఎంకు నిప్పు అంటుకుందని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరిన పోలీసులు సీసీ టీవీ పుటేజీని పరిశీలించారు. దుండగుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు అక్కడి పోలీసు అధికారి తెలిపారు.
హొసపేటెలో...
హొసపేటె: నగరంలోని స్టేషన్ రోడ్డులో ఉన్న కనకదాస సర్కిల్‌లోని బోడ రంగప్ప ఇంటి సమీపంలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో డబ్బులను దొంగలించేందుకు దొంగల ముఠా ముమ్మరంగా ప్రయత్నించిన ఘటన మంగళవారం రాత్రి జరిగింది. జనసంచారం లేని సమయాన్ని గమనించి అర్ధరాత్రి వేళ నలుగురు వ్యక్తుల బృందం ఏటీఎంను దోచుకోవడానికి యత్నం చేశారు. దొంగలు ఏటీఎం మిషన్లో ఉన్న డబ్బులు దొంగలించేందుకు ప్రయత్నిస్తు సమయంలో సీసీటీవీపై స్ప్రే చేయడంతో సైరన్ మోగింది. దీంతో విజయనగర పోలీస్ కంట్రోల్ రూంకు సమాచారం అందింది. పోలీస్ కంట్రోల్ రూం నుంచి నైట్ బీట్ పోలీసులకు సమాచారం చేరింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకునేలోపు అప్రమత్తమైన దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై హొసపేటె టౌన్ పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. నిందితుల ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు.
విఫలమై నిప్పు పెట్టిన దుండగులు
కొప్పళ నగరంలో ఘటన కలకలం


