రాయచూరు రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలను సక్రమంగా అమలు చేసి, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వ మహత్వాకాంక్ష పథకం సంయుక్త కార్యదర్శి ఉజ్వల్ కుమార్ ఘోష్ సూచించారు. మంగళవారం రాయచూరు, గబ్బూరు, మసరకల్‌లోని ప్రభుత్వ ఆదర్శ విద్యాలయం, యరమరస్ ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసి మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రాల చుట్టు పక్కల పరిశుభ్రతను పాటించి, వంట గది, తరగతి గదులు, గోదాములను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు. వానా కాలంలో మలేరియా, డెంగీ వంటి వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఒపెక్ ఆస్పత్రిని పరిశీలించారు. ఆయన వెంట జెడ్పీ సీఈఓ ఈశ్వర్, జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్ర బాబు, ఐసీడీఎస్ అధికారిణి శరణమ్మ, జిల్లా విద్యా శాఖాధికారి మల్లికార్జున, నందిత, ఒపెక్ ఆస్పత్రి అధికారి రమేష్‌లున్నారు.


