రాజ కాలువలు శుభ్రం చేయాలని ధర్నా | - | Sakshi
Sakshi News home page

రాజ కాలువలు శుభ్రం చేయాలని ధర్నా

Jun 10 2026 1:37 AM | Updated on Jun 10 2026 1:37 AM

మూడు గంటల పాటు మురుగు నీటిలో ఆందోళన

రాయచూరు రూరల్‌: రాజ కాలువలను శుభ్రం చేయాలంటూ ఓ వ్యక్తి మూడు గంటల పాటు మురుగు నీటిలో ఆందోళన చేపట్టిన ఘటన బెళగావి జిల్లాలో చోటు చేసుకుంది. సోమవారం బెళగావి జిల్లా బైలహొంగలలో భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో కులకర్ణి వీధి, కూలికార్‌ కాలనీ, పాటిల్‌ వీధుల్లో మురుగు కాలువల్లో పేరుకు పోయిన చెత్తా చెదారాలు తొలగించకుండా వదిలి వేయడంతో ఈశ్వర్‌ అనే వ్యక్తి వర్షపు నీటిలో మూడు గంటల పాటు నిలబడి ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న బైలహొంగల మున్సిపల్‌ కమిషనర్‌ భాగ్యశ్రీ ధర్నా స్థలానికి వచ్చి కాలువల శుభ్రతకు చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో ఈశ్వర్‌ ధర్నాను విరమించారు.

మరణంలోనూ వీడని బంధం

ఒకే రోజు తల్లీ, కుమారుడు మృతి

హుబ్లీ: శతాయుష్కురాలైన తల్లి, ఆమె కుమారుడు ఇద్దరూ ఒకే రోజు మరణించిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. అణ్ణిగేరిలోని కురుబ వీధికి చెందిన శతాయుషి గంగమ్మ(102), ఆమె కుమారుడు శంక్రప్ప(60) మృతులు. ముందుగా గంగమ్మ వయోసహజ మరణం చెందారు. ఆమెకు ముగ్గురు కుమారులు. ఆమె మృతదేహాన్ని అంత్యక్రియల కోసం శ్మశానానికి తీసుకెళ్లగా ఇంట్లో ఉన్న ఆమె కుమారుడు శంక్రప్ప కూడా మృతి చెందాడని సమాచారం అందింది. వెంటనే శ్మశానంలో తల్లి అంత్యక్రియలను నిలిపి వేసి కుమారుడి మృతదేహాన్ని కూడా అంతిమయాత్ర ద్వారా తీసుకొచ్చి ఇద్దరికీ అంత్యసంస్కారాలు నెరవేర్చారు. తల్లీ, కుమారుడు చావులోను ఒక్కటయ్యారని, ఎంతో పుణ్యాత్ములు అని బంధువులు మాట్లాడుకున్నారు. కాగా శంక్రప్పకు భార్య, ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

పెట్రో ధరలు తగ్గించండి

రాయచూరు రూరల్‌: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలను తగ్గించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. మంగళవారం అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద చేపట్టిన ఆందోళనలో విధాన పరిషత్‌ సభ్యుడు వసంత్‌ కుమార్‌ మాట్లాడారు. కేంద్ర సర్కార్‌ ఇటీవల ధరలు పెంచుతూ పేద ప్రజల నడ్డివిరుస్తోందన్నారు. మే 15 నుంచి 25 వరకు పెట్రోల్‌పై రూ.7.38, డీజిల్‌పై రూ.7.52, గ్యాస్‌ సిలిండర్‌పై రూ.100 చొప్పున పెంచడాన్ని తీవ్రంగా ఖండించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం పెట్రో ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయన్నారు. ఆందోళనలో జిల్లాధ్యక్షుడు బసవరాజ్‌ పాటిల్‌, శాంతప్ప, శివమూర్తి, జాగీర్దార్‌, అస్లాం పాషా, పవన్‌, మర్రిస్వామి, శ్రీదేవి, శశికళ, సురేఖ, రజాక్‌ ఉస్తాద్‌లున్నారు.

రైతుల సంక్షేమానికి

ఎత్తిపోతల అవసరం

రాయచూరు రూరల్‌: రైతుల సంక్షేమానికి ఎత్తిపోతల పథకాలు అవసరమని భావించి రాష్ట్ర ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలను మంజూరు చేసిందని గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్‌ పేర్కొన్నారు. మంగళవారం గ్రామీణ శాసన సభ్యుడి కార్యాలయంలో రైతులు ఆయనను సత్కరించిన సందర్భంగా మాట్లాడుతూ మటమారి వీరభద్రేశ్వర ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం రూ.182 కోట్లతో 16 వేల ఎకరాలకు నీరందించే పథకానికి అనుమతి లభించిందన్నారు.

విద్యార్థుల హాస్టళ్లను

ప్రారంభించాలి

రాయచూరు రూరల్‌: 2026–27వ విద్యా సంవత్సరానికి విద్యార్థులకు పాఠశాలల్లో ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైనందున హాస్టళ్ల ప్రారంభానికి చర్యలు చేపట్టాలని భారత విద్యార్థి సమాఖ్య(ఎస్‌ఎఫ్‌ఐ) డిమాండ్‌ చేసింది. మంగళవారం దేవదుర్గ తాలూకా సాంఘీక సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు సంతోష్‌ మాట్లాడారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా హాస్టళ్లను ప్రారంభించాలన్నారు. బయో మెట్రిక్‌ పద్ధతిని రద్దు చేయాలని కోరుతూ తాలూకా విద్యాశాఖాధికారి రాధాదేవికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో గిరియప్ప, అభిషేక్‌, రియాజ్‌, రాజు, మౌనేష్‌, బసవరాజ్‌, రామన్న, బాలు, హనుమంతులున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement