కేకేఆర్టీసీ బస్సు బోల్తా | - | Sakshi
Sakshi News home page

కేకేఆర్టీసీ బస్సు బోల్తా

Jun 10 2026 1:37 AM | Updated on Jun 10 2026 1:37 AM

హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకా మోరిగేరి క్రాస్‌ సమీపంలో కేకేఆర్‌టీసీ బస్సు యాక్సిల్‌ విరగడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గోతిలోకి బోల్తా పడిన ఘటన మంగళవారం జరిగింది. అయితే డ్రైవర్‌ చాకచక్యంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఉదయం 6.45 గంటలకు హడగలి నుంచి హగరిబొమ్మనహళ్లి వైపు వెళుతున్న కేకేఆర్‌టీసీ బస్సు యాక్సిల్‌ పూర్తిగా విరగడంతో బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఆ సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉండగా, కొందరికి మాత్ర ం స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారికి తాలూకా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు.

నియామకం

బళ్లారిటౌన్‌: జాతీయ మానవ హక్కుల పురుషుల హితరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడుగా ఎస్‌బీఐ రిటైర్డ్‌ ఉద్యోగి రామకృష్ణను నియమించినట్లు కమిటీ సంస్థాపక అధ్యక్షురాలు రజినీ రాజ్‌ వెల్లడించారు. మంగళవారం పత్రికా భవనంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సమితిని కొద్ది రోజుల క్రితం మండ్య జిల్లాలో ప్రారంభించామన్నారు. ప్రతి జిల్లాలోను సమితిని ఏర్పాటు చేసి పురుషుల హక్కుల కోసం ఈ సమితిని ఏర్పాటు చేశామన్నారు. ఇంత వరకు మహిళలకు జరిగే అన్యాయాలు, హక్కులపై పోరాడుతూనే ఉన్నారన్నారు. కానీ ఇటీవల పురుషులపై కూడా పలువురు మహిళల నుంచి దౌర్జన్యాలు, దాడులు జరుగుతున్నాయన్నారు. మహిళల మేలు కోసం ఏర్పాటు చేసిన చట్టాల దుర్వినియోగంతో పురుషులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సమాజంలో పురుషుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. తాము సమితి రచించినప్పటి నుంచి పురుషులు ఎదుర్కొంటున్న సమస్యలు తమ దృష్టికి వస్తున్నాయన్నారు. తాము వెంటనే స్పందించి కౌన్సిలింగ్‌ ఇచ్చి పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. బళ్లారి జిల్లాలోను పురుషులు వేధింపులకు గురవుతున్న వెంటనే స్థానిక అధ్యక్షుడిని సంప్రదించవచ్చని వివరించారు. కోశాధికారి వేదవల్లి, మేనేజింగ్‌ ట్రస్టీ శకుంతల, రామకృష్ణ పాల్గొన్నారు.

కనకగిరిలో దారుణం

అత్యాచారం చేసి మహిళ హత్య

ఆపై మృతదేహాన్ని కాల్చిన వైనం

హుబ్లీ: నిర్మాణ దశలోని భవనంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం మంటల్లో కాలుతున్న స్థితిలో లభించిన ఘటన కొప్పళ జిల్లా కనకగిరిలో చోటు చేసుకుంది. కనకగిరి 5వ వార్డులో సంగప్పకు చెందిన సదరు నిర్మాణ దశలోని భవనం 3వ అంతస్తులో కాల్చి వేసిన స్థితిలో మృతదేహం లభించింది. దుండగులు మహిళపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసి నిప్పు పెట్టి కాల్చినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతురాలి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. కనకగిరి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితుల ఆచూకీ కోసం తీవ్రంగా గాలింపు చేపట్టారు.

హితవు పలికాడని తండ్రి హత్య

హుబ్లీ: హితవు పలికినందుకు తండ్రిపై కోపంతో కట్టెతో దాడి చేసి చంపిన ఘటన నగరంలోని గోపనకొప్ప సిద్దేశ్వర కాలనీలో చోటు చేసుకుంది. కల్లప్ప మూలిమని(50) మృతుడు. ఈయన కుమారుడు మహేష్‌ నిందితుడు. కల్లప్ప కుమారుడు మహేష్‌కు తరచు బుద్ధిమాటలు చెప్పేవాడు. దీంతో ఆగ్రహం చెందిన కుమారుడు కట్టెతో ముందుగా ముఖం, ఆ తర్వాత తలపై బాదాడు. దీంతో తీవ్రంగా గాయపడిన కల్లప్ప మృతి చెందాడు. అశోక్‌ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

డిమాండ్లు తీర్చాలని నిరసన

హొసపేటె: వేతన బకాయిల చెల్లింపుతో సహా పలు డిమాండ్లను తీర్చాలని ఒత్తిడి చేస్తూ ఆశా కార్యకర్తలు నగరంలో నిరసన చేపట్టారు. ఏఐయూటీయూసీ అనుబంధ కర్ణాటక రాష్ట్ర యునైటెడ్‌ ఆశా వర్కర్స్‌ అసోసియేషన్‌ నేతృత్వంలో జిల్లా ఆరోగ్య అధికారి కార్యాలయం ముందు నిరసన తెలిపిన ఆశా కార్యకర్తలు, అనంతరం జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారి డాక్టర్‌ శంకర్‌ నాయక్‌కు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు డాక్టర్‌ ప్రమోద్‌ మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకూ గత ఐదు నెలలుగా జీతాలు లేవన్నారు. స్కూళ్లు ఇప్పటికే తెరిచారు. నిత్యావసర వస్తువుల ధరలు మరింతగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆశాల జీవితాలతో చెలగాటం ఆడటం ఖండనీయమన్నారు. ఆశా కార్యకర్తలు మంగళ, మహేశ్వరి, చెన్నమ్మ, నాగమ్మ, సుప్రియ, గౌరి, రుక్కిణి, లక్ష్మీదేవి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement