ప్రభుత్వ ఉద్యోగి డిజిటల్‌ అరెస్టు.. రూ.83 లక్షల వసూలు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగి డిజిటల్‌ అరెస్టు.. రూ.83 లక్షల వసూలు

Jun 10 2026 1:31 AM | Updated on Jun 10 2026 1:31 AM

దొడ్డబళ్లాపురం: డిజిటల్‌ అరెస్టు అని సైబర్‌ నేరగాళ్లు బెదిరించి ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ.83.82 లక్షలు వసూలు చేశారు. ఈ ఘటన బాగల్‌కోటలో జరిగింది. అప్పర్‌ కృష్ణా ప్రాజెక్టు కార్యాలయంలో పని చేస్తున్న హెచ్‌వీ సురేశ్‌ రావ్‌ (59) బాధితుడు. ముందుగా ట్రాయ్‌ పేరుతో ఫోన్‌ చేసిన దుండగులు ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులమని చెప్పారు. మీ ఆధార్‌ కార్డు పేరుమీద తీసుకున్న సిమ్‌ కార్డుల నుంచి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని, కేసులు నమోదు చేశామని బెదిరించారు. ఆ తరువాత వీడియోకాల్స్‌ చేసి పోలీస్ట్‌షన్‌, కోర్టు లాయర్లు, జడ్జీలను చూపించారు. సురేశ్‌ రావ్‌ భయపడడంతో కేసుల నుంచి బయటపడాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని డిమాండు చేశారు. దీంతో సురేశ్‌ పలు విడతలుగా మొత్తం రూ.83.82లక్షలు సమర్పించుకున్నాడు. ఈ తతంగం మార్చ్‌ 18 నుండి ఏప్రిల్‌ 15 వరకూ నడిచింది. తాను మోసపోయినట్టు తెలుసుకున్న సురేశ్‌రావ్‌ ఇప్పుడు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కుప్పలు కుప్పలుగా పాములు

నెలమంగలలో భయం భయం

దొడ్డబళ్లాపురం: దూరంగా వెళ్లే ఒక్క పామును చూస్తేనే ఒళ్లు భయంతో జలదరిస్తుంది. అలాంటి ఇళ్ల ముందే అనేక సర్పాలు కనిపిస్తే చెమటలు పట్టాల్సిందే. బెంగళూరు సమీపంలో నెలమంగల పట్టణంలో ఇలాంటి సమస్యే ఏర్పడింది. ఇళ్ల మధ్యలో కుప్పలుగా సర్పాలు తిరుగుతున్నాయి. దీంతో ప్రజలు బెంబేతెల్లిపోతున్నారు. ఇళ్ల లోపల, ముందు, కాంపౌండ్లలో, చెప్పుల స్టాండ్లలో, పొదల్లో ఇలా ఎక్కడ చూసినా సర్పాలే దర్శనమిస్తున్నాయి. స్నేక్‌ క్యాచర్‌ విశ్వనాథ్‌ ఎవరు ఫోన్‌ చేసినా వెంటనే వెళ్లి బంధించి దూరంగా వదిలేస్తున్నాడు. ఎక్కువగా ప్రమాదకర రక్తపింజర, నాగుపాములు ఉంటున్నాయి. ఓ ఫాం హౌస్‌లోనే 20 పైగా రక్తపింజర పాముల పిల్లలు కనిపించగా వాటిని పట్టి బకెట్లో వేశారు. అలాగే నాగుపాము పిల్లలూ దొరికాయి. దేశంలోనే అత్యధిక విషం కలిగిన నాలుగు రకాల పాములు కూడా నెలమంగలో దొరికాయని విశ్వనాథ్‌ తెలిపాడు. ప్రజలు చాలా జాగ్రత్తా ఉండాలని ఆయన సూచించారు.

నేనేమీ చించలేదన్నావు.. నన్నెందుకు కలుస్తావు?

సీఎం శివపై కుమారస్వామి రుసరుస

శివాజీనగర: నూతన సీఎం డీకే శివకుమార్‌ మాజీ సీఎంలను, సీనియర్‌ నాయకులను మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. అదే మాదిరిగా మాజీ సీఎం, ప్రస్తుత కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి అవకాశమిస్తే వెళ్లి ఆయనను కలుస్తానని ప్రకటించారు. కాకపోతే ఇద్దరి మధ్య దశాబ్దాలుగా తీవ్ర వైరం సాగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం బెంగళూరులో కుమారస్వామి తనదైన శైలిలో స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ ‘డీకే శివకుమార్‌ ఈ అతి వినయపు ప్రదర్శన వెనుక రాజకీయ కుట్ర దాగి ఉంది. రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన నేను ఏమి చించాను? అని గతంలో ఇదే డీకే శివకుమార్‌ విర్శించారు. నేనేమీ చింపలేదన్న తరువాత ఆయన ఎందుకు నా వద్దకు వచ్చి ఏ సలహాను అడుగుతారు? ఆయనకు నేనేమి సలహాలు ఇవ్వగలను?’ అని దుయ్యబట్టారు. డీ.కే.శివకుమార్‌కు మీడియాలో ప్రచారం, ఫోటోలు కావాలి, అందుకోసమే నేతల ఇళ్లకు వెళుతున్నారని కుమార ఆరోపించారు. అతి వినయం ధూర్త లక్షణం అనే సంస్కృత సూక్తి శివ కుమార్‌కు సరిపోతుందని ఎద్దేవా చేశారు.

ఎమ్మెల్యేపై ఈడీకి ఫిర్యాదు

బనశంకరి: రూ.2 వేల కోట్లకు పైగా విలువచేసే బెంగళూరు నగర పాలికే ఆస్తిని చట్ట వ్యతిరేంగా కుదువపెట్టి రూ.754 కోట్ల రుణం తీసుకున్నారని చిక్కపేటే ఎమ్మెల్యే ఉదయ్‌ గరుడాచార్‌, మరికొందరిపై ఈడీకి ఫిర్యాదు వెళ్లింది. జాగృతి ఓటర్ల వేదిక కార్యదర్శి బీ.గణేశ్‌సింగ్‌ ఈ మేరకు 1,430 పేజీలతో మంగళవారం ఈడీకి ఫిర్యాదు చేశారు. కోరమంగల ఈజీపురలో 15.64 ఎకరాల పాలికే భూమి విలువ రూ.2 వేల కోట్లకు పైగా ఉంటుందన్నారు. పేదలకు 1,640 ఇళ్లు నిర్మించడానికి 2012లో ఈ భూమిని ప్రైవేటు సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారన్నారు. అక్కడ ఎమ్మెల్యేకు చెందిన సంస్థ ఇళ్లే కట్టలేదని, పైగా భూమిని కుదువపెట్టి రూ.754 కోట్లు రుణం తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సీఎం పదవి మళ్లీ మిస్‌: డీసీఎం

తుమకూరు: నాకు గతంలో 3 సార్లు సీఎం పదవి తప్పిపోయింది అని కొత్త డిప్యూటీ సీఎం పరమేశ్వర్‌ వాపోయారు. తుమకూరులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కావాలనే తన చిరకాల కోరిక ఇంకా అలాగే ఉందని ఉద్వేగానికి గురయ్యారు. 2013 ఎన్నికల్లో పార్టీ గెలిచినా, తాను ఓడిపోవడం వల్ల ముఖ్యమంత్రి పదవి తప్పిపోయిందని, ఆనాడు తాను గెలిచి ఉంటే సిద్ధరామయ్య సీఎం అయ్యేవారు కాదని తెలిపారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 80 స్థానాల్లో గెలుపొందినా మైత్రి సర్కార్‌ కారణంగా హెచ్‌డీ కుమారస్వామి సీఎం అయ్యారన్నారు. ఈసారి కూడా సీఎం పదవి తనకు రావాల్సి ఉన్నా, వివిధ రాజకీయ కారణాల వల్ల సాధ్యపడలేదని అన్నారు. ఇటీవల ఢిల్లీలో సీఎం పదవి ఇవ్వకపోతే వెంటనే చెప్పేయాలని, తనకు అవతల చాలా పనులు ఉన్నాయని హైకమాండ్‌కు చెప్పేశానన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement