మండ్య: గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు చదువుతోనే లక్ష్యాలను సాధించగలరని వక్తలు తెలిపారు. మండ్య తాలూకాలోని హనకెరె గ్రామంలోని రైతు విద్యా సంస్థలో విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్‌లను పంపిణీ చేశారు. విద్య అనేది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి. ప్రతి విద్యార్థి మంచి విద్యను అభ్యసించి సమాజంలో ఉన్నత స్థానాన్ని సంపాదించుకోవాలని అన్నారు. బాలలు విద్యతో పాటు మంచి నడవడిక, క్రమశిక్షణ, నైతిక విలువలను అలవర్చుకోవాలి. మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు.
ఉగ్ర దాడులకు పన్నాగం
బనశంకరి: పాక్ ఉగ్రవాదులతో సంప్రదింపులు జరుపుతూ అరెస్టయిన తుమకూరు శ్రీరామనగర నివాసి అల్లాబక్షి, దావణగెరెవాసి జమీర్‌ఖాన్ దేశంలో పేలుళ్లకు కుట్ర చేశారని పోలీసుల విచారణలో వెల్లడైంది. అల్లాబక్షి ఇన్‌స్టాలో పాక్ ఉగ్రవాదులను ఠాణా బాయి బాయి అని సేవ్ చేసుకున్నాడు. హిందీలో వారికి సందేశాలు పంపేవాడు. జమీర్‌ఖాన్‌తో కలిసి దేశంలో కనీసం 60 మంది యువకులను ఉగ్రవాదులుగా తయారు చేయాలని, దీనికి అయ్యే ఖర్చును ఉగ్రసంస్ద అందిస్తుందని నిందితులు విచారణలో తెలిపారు. తుమకూరు పోలీసులు, కేంద్ర నిఘా అధికారులు వారిని విచారిస్తున్నారు. దేశంలో విధ్వంసానికి పాల్పడాలని, తమ మత వ్యతిరేకులపై దాడులు చేయాలని అనుకున్నట్లు చెప్పారు.
ఎస్పీ పేరుతో మోసాల దందా
దొడ్డబళ్లాపురం: విజయపుర జిల్లా ఎస్పీ లక్ష్మణ్ నింబరగి పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ ఐడీ క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్న వంచకున్ని అక్కడి సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు బెళగావి జిల్లా గోకాక్‌కు చెందినన హనుమంత భజంత్రి. విజయపుర జిల్లా ఎస్పీ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఐడీ క్రియేట్ చేశాడు. చాటింగ్ చేస్తూ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పుకునేవాడు. ఇలా బబలేశ్వర తాలూకా బిదరి గ్రామం నివాసి సురేశ్ అథణి అనే వ్యక్తికి పీడబ్ల్యూడీ శాఖలో క్లర్కు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.5లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగం ఇవ్వకపోవడంతో బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా భజంత్రి గుట్టు రట్టయింది.
కాంగ్రెస్ నేత సూరజ్ హెగ్డే కన్నుమూత
శివాజీనగర: ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర గ్యారెంటీ పథకాల అమలు కమిటీ ఉపాధ్యక్షుడు సూరజ్ హెగ్డే (55) తీవ్ర గుండెపోటుతో బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో ఆదివారం రాత్రి కన్నుమూశారు. నివాసంలో ఉండగా అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మరణించారు. హెగ్డే మృతికి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, సీఎం డీ.కే.శివకుమార్‌తో పాటు పెద్దసంఖ్యలో నాయకులు సంతాపం తెలిపారు. పార్టీ నేతగా ఆయన సేవలను కొనియాడారు. సూరజ్ హెగ్డే తన తాత దేవరాజ అరస్ మాదిరిగా వెనుకబడిన వర్గాలు, కార్మికుల హక్కు, సామాజిక న్యాయం కోసం శ్రమించేవారని ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సూరజ్ ఆత్మకు శాంతి కలగాలన్నారు.
బీజేపీతో జేడీఎస్‌కు అంతే
మండ్య: రాజ్యసభ ఎన్నికల్లో మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ, మాజీ ఎంపీ సుమలత అంబరీష్‌కు బీజేపీ రాజ్యసభ టికెట్లు ఇవ్వకుండా ఒక్కలిగలకు అన్యాయం చేసిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే పి.రవికుమార్ ఆరోపించారు. సోమవారం ఇక్కడ ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేవేగౌడకు టికెట్ ఇవ్వకుండా జేడీఎస్‌ను అంతం చేయడానికి బీజేపీ మేకులు కొడుతూనే ఉంది. వారు చివరి మేకు ఎప్పుడు కొడతారో మాకు తెలియదు, జేడీఎస్ అనే పార్టీని బీజేపీ నాశనం చేస్తుంది అని విమర్శలు గుప్పించారు. దేవెగౌడపై ప్రధాని నరేంద్ర మోదీ చూపే ప్రేమ నాటకమని, టీవీలు, కెమెరాల కోసం వేసే పోజు అని విమర్శించారు. కుమారస్వామి పోటీ చేస్తానంటే సుమలత మండ్య స్థానాన్ని త్యాగం చేశారని, అలాంటి ఆమెకు బీజేపీ ఏ పదవీ ఇవ్వకుండా అన్యాయం చేయడం ఖండనీయమన్నారు.


