సుర్జేవాలా వర్సెస్‌ జేడీఎస్‌ | - | Sakshi
Sakshi News home page

సుర్జేవాలా వర్సెస్‌ జేడీఎస్‌

Jun 9 2026 8:40 AM | Updated on Jun 9 2026 8:40 AM

శివాజీనగర: రాజ్యసభకు మాజీ ప్రధాని దేవేగౌడను బీజేపీ ఎంపిక చేయక పోవడం హాట్‌ టాపిక్‌ అయ్యింది. జేడీఎస్‌ను బీజేపీ అవమానించినా కేంద్ర మంత్రి కుర్చీని కాపాడుకునేందుకు మౌనంగా ఉందని రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జి రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా ఎక్స్‌లో విమర్శించారు. ఈ విమర్శలపై జేడీఎస్‌ మండిపడింది. వసూళ్ల కోసం కర్ణాటకను ఏటీఎంగా చేసుకొన్న సుర్జేవాలా.. దేవేగౌడ సంగతిని పక్కనపెట్టి, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో జరుగుతున్న అంతర్గత గొడవల వైపు చూడాలని దుయ్యబట్టింది. దేవేగౌడ మేటి కన్నడిగుడని, భరత భూమిని ఏలిన శ్రేష్ట నాయకుడని ఎక్స్‌లో పేర్కొంది. మరోవైపు బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా పార్టీ నేత ఎం.నాగరాజ్‌ విధానసౌధలో నామినేషన్‌ దాఖలు చేశారు. యడియూరప్ప, విజయేంద్ర, నేతలు పాల్గొన్నారు.

ఎయిర్‌పోర్టులో రూ.5.90 కోట్ల గంజాయి సీజ్‌

దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు రూ.5.90 కోట్ల విలువైన హైడ్రోఫోనిక్‌ గంజాయిని పట్టుకున్నారు. బ్యాంకాక్‌ నుంచి బెంగళూరుకు వచ్చిన ఒక ప్రయాణికుని లగేజీని తనిఖీలుచేయగా, అక్రమంగా దాచి తరలిస్తున్న 10.20 కేజీల హై.గంజాయి పట్టుబడింది. అతన్ని అరెస్టు చేసి మత్తు పదార్థాల నియంత్రణ చట్టం కింద కేసు నమోదు చేశారు. మరో ప్రయాణికుని వద్ద 6.6 కేజీల హై.గంజాయి లభించింది.

మైసూరులో 280 కేజీలు...

మైసూరు: మైసూరులో పోలీసులు 280 కేజీల సాధారణ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బన్నూర్‌ చెక్‌పోస్ట్‌ సమీపంలో ఓ కారు, లారీని ఆపి సోదాలు చేయగా, అందులో ఈ గంజాయి బస్తాలు లభించాయి. దానిని తరలిస్తున్న మహమ్మద్‌ జుబేర్‌, ముదాసిర్‌ అహ్మద్‌, అబూబకర్‌ సిద్ధిఖీ, సయ్యద్‌ మజార్‌ అనేవారిని అరెస్టు చేశారు. పోలీస్‌ కమిషనర్‌ సీమా లాట్కర్‌ కేసు వివరాలను వెల్లడించారు. మైసూరులో ఇటీవలి కాలంలో ఇంత భారీ మొత్తంలో గంజాయి దొరకడం ఇదే తొలిసారి. వీటిని ఎక్కడి నుంచి తెచ్చారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది మిస్టరీగా ఉంది.

జూదగానిపై హత్యాయత్నం

శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలోని భద్రావతి నగరంలోని హోళహొన్నూరు రోడ్డులోని అన్వర్‌ కాలనీలో ముద్దె అలియాస్‌ ఎం.విశ్వనాథ్‌ (35) అనే వ్యక్తిపై దుండగులు కత్తులు, కొడవళ్లతో హత్యాయత్నం చేశారు. ఆరేడు మంది వ్యక్తుల గుంపు ఆకస్మాత్తుగా విశ్వనాథ్‌పై దాడి చేసి పరారైంది. తీవ్ర గాయాలతో పడిపోయిన విశ్వనాథ్‌ను స్థానికులు, కుటుంబ సభ్యులు శివమొగ్గలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. భద్రావతి ప్రాంతంలో విశ్వనాథ్‌ను ’ఇస్పేట్‌ కింగ్‌’ అని పిలుస్తారు. జూదాల్లో ఆరితేరినవాడని పేరుంది. ఈ గొడవలతోనే దాడి జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. భద్రావతి హలేనగర్‌ పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. డీఎస్పీ, సీఐలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు అలముకొన్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement