హాస్టల్‌లో ఆలనా పాలనా కరువై తుప్పు పడుతున్న పడకలు
పరిశుభ్రత లోపించి దుస్థితిలో మరుగుదొడ్లు
సాంఘీక సంక్షేమ శాఖ విద్యార్థుల హాస్టల్
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో సాంఘీక సంక్షేమ, వెనుక బడిన వర్గాల శాఖ పరిధిలోని హాస్టళ్ల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆ శాఖ హాస్టళ్లలో అవినీతి మితిమీరి పోవడంతో విద్యార్థులు ఆందోళన బాట పడుతున్నారు. కళ్యాణ కర్ణాటక పరిధిలోని కలబుర్గి, యాదగిరి, రాయచూరు, కొప్పళ, బీదర్, బళ్లారి, విజయనగర జిల్లాల్లో సాంఘీక సంక్షేమ శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, కింది స్థాయి ఉద్యోగుల అక్రమార్జన ఫలితంగా హాస్టళ్ల పని తీరు నిరాశాజనకంగా మారింది. కళ్యాణ కర్ణాటకలో వెనుక బడిన వర్గాల హాస్టళ్లు 450, సాంఘీక సంక్షేమ హాస్టళ్లు 550, షెడ్యూల్డ్ తెగల హాస్టళ్లు 100, రాయచూరు జిల్లాలో వెనుక బడిన వర్గాల హాస్టళ్లు 90, సాంఘీక సంక్షేమ హాస్టళ్లు 110, షెడ్యూల్డ్ తెగల హాస్టళ్లు 25కు పైగా ఉన్నాయి.
లోపించిన కనీస వసతులు
విద్యార్థులకు తగ్గట్టు హాస్టళ్లలో భోజనం వడ్డించక పోవడం, కనీస వసతులు కల్పించడంపై వార్డెన్లు, సిబ్బంది దృష్టి సారించలేక పోతున్నారు. ఫలితంగా విధి లేని పరిస్థితులో విద్యార్థులు కాలాన్ని వెళ్లదీయాల్సిన పరిస్థితి దాపురించింది. ఇది విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇక హాస్టళ్ల నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో ఊహించుకోవచ్చు. జిల్లా కేంద్రంలోనే ఇలాంటి దారుణ పరిస్థితి ఉంటే గ్రామీణ ప్రాంతాల్లోని హాస్టళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో విదితమవుతోంది. హాస్టళ్ల పనితీరుపై పర్యవేక్షణ లోపం వల్లే నేడు ఈ పరిస్థితికి దిగజారాయి. హాస్టళ్లలో పారిశుధ్యం కొరవడడంతో అపరిశుభ్రతకు నిలయాలుగా మారాయి. ఉన్నతాధికారులు వీటిని తూతూ మంత్రంగా తనిఖీ చేస్తుండడంతో వార్డెన్లు, సిబ్బంది అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.
విధులకు సిబ్బంది డుమ్మా
గ్రామీణ ప్రాంతాల్లో హాస్టల్ వార్డెన్లు వారానికోసారి మాత్రమే పర్యవేక్షిస్తున్నారు. హాస్టళ్లలో వాచ్‌మెన్లు, వంట మనిషులుగా నియమితులవుతున్న సిబ్బంది తమ విధులను ఇతరుల ద్వారా చేయిస్తూ దర్జాగా తిరుగుతున్నారు. జిల్లాలో హాస్టల్ విద్యార్థులు అనారోగ్యానికి గురి కావడం సర్వసాధారణమైంది. వారం రోజుల క్రితం లింగసూగూరు, సింధనూరు, రాయచూరు హాస్టళ్లలో వార్డెన్లు విద్యార్థులకు భోజనం పెట్టకుండా మూడు రోజుల పాటు ఉపవాసం పెట్టిన ఘటన నెలకొంది. ఈ విషయంలో జిల్లా స్థాయి అధికారులు మౌనం వహించడం తగదని విద్యార్థులు వాపోతున్నారు. హాస్టళ్లలో కనీస సౌకర్యాలు మెరుగు పరచడంతో పాటు అక్రమార్జనకు అలవాటు పడ్డ వార్డెన్లు, సిబ్బందిపై చర్యలు చేపటాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కళ్యాణ కర్ణాటకలోని జిల్లాల్లో
అధ్వానంగా హాస్టళ్ల నిర్వహణ
పెరిగిన వార్డెన్, సిబ్బంది అవినీతి, అక్రమార్జనతో నిరాశాజనకం


