రాయచూరు రూరల్: కృష్ణా భాగ్య జల నిగమ నియమిత(కేబీజేఎన్‌ఎల్)లో విధులు నిర్వహిస్తున్న అధికారులు లంచం తీసుకుంటూ లోకాయుక్త వలలో చిక్కిన ఘటన సోమవారం విజయపుర జిల్లాలో చోటు చేసుకుంది. కాంట్రాక్టర్ నానా సాహెబ్ చేసిన పనులకు చెల్లించాల్సిన రూ.3,71,419 బిల్లుకు చెక్ ఇచ్చేందుకు విజయపుర జిల్లా ఇండి తాలూకా సాలోటగి కార్యాలయం అధికారులు రూ.18 వేలు లంచం అడిగారు. ఈ విషయంపై కాంట్రాక్టర్ నానా సాహెబ్ లోకాయుక్త అధికారులను ఆశ్రయించారు. దీంతో పక్కా ప్రణాళిక ప్రకారం కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఏఈ సేవాలాల్ చౌహాన్ రూ.10 వేలు, జూనియర్ ఇంజనీర్ సాత్‌లింగప్ప రూ.8 వేలు లంచం తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు దాడి చేసి వారిద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
హెస్కాం ఉద్యోగి ఆత్మహత్య
హుబ్లీ: కుందగోళ హెస్కాం కార్యాలయంలో పవర్ మ్యాన్‌గా పని చేస్తున్న హెస్కాం ఉద్యోగి హుబ్లీలోని ఆర్‌ఎం లోహియానగర్‌లోని అద్దె ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మంజునాథ్ డొంబర(28) ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి. భార్య మేఘ, తల్లి శోభ, సోదరుడు రాజేష్ వేధింపులతో మనోవేదనకు గురై మంజునాథ్ ఆత్మహత్య చేసుకున్నట్లు అతని తండ్రి పాత హుబ్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రజలారా భయపడకండి, అండగా మేమున్నాం
● కూడ్లిగిలో రాత్రంతా వీధుల్లో అధికారులు, పోలీసుల గస్తీ
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి పట్టణంలోని బసవేశ్వర సర్కిల్ సమీపంలో ఇళ్ల చుట్టూ ఇటీవల ముసుగులు ధరించిన దొంగలు తిరుగుతున్న వీడియో వైరల్ కావడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. హొసహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కానామడుగులో మూడు ఇళ్లలో చోరీలు జరిగినట్లు వార్తలొచ్చాయి. కానీ ఈ ఘటనలపై కేసులు నమోదు కాలేదు. ఈనేపథ్యంలో కూడ్లిగి డీఎస్పీ మల్లేష్ దొడ్డమని నేతృత్వంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, కూడ్లిగి, గుడేకోటె, హొసహళ్లి, కొట్టూరు, హగరిబొమ్మనహళ్లి స్టేషన్లకు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్లు, పోలీసులు ఆదివారం రాత్రంతా కూడ్లిగి బస్టాండ్‌తో సహా పట్టణ వీధుల్లో గస్తీ తిరుగుతూ తాము మీకు అండగా ఉన్నామని, భయపడవద్దని ప్రజలకు భరోసా కల్పించారు.
ప్రజా సమస్యలు పరిష్కరించండి
రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తోడు మౌలిక సౌకర్యాలు కల్పించాలని విధాన పరిషత్ సభ్యుడు బసనగౌడ బాదర్లి అధికారులను ఆదేశించారు. సోమవారం సింధనూరు తాలూకా గాంధీనగర్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించి ఆయన మాట్లాడారు. గ్రామాల్లోని మురుగు కాలువల్లో పూడిపోయిన చెత్తా చెదారాన్ని తొలగించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. తుంగభద్ర కాలువ నుంచి చెరువుకు తాగునీటిని పంపింగ్ చేయాలన్నారు. గుంతలు పడ్డ రహదారులకు మరమ్మతులు చేయాలన్నారు. చౌక ధర దుకాణాల ద్వారా పేదలకు సక్రమంగా బియ్యం పంీపిణీ చేపట్టాలన్నారు.
అనుమానాస్పద రీతిలో విద్యార్థి మృతి
హుబ్లీ: ధార్వాడలోని ప్రముఖ పాఠశాల హాస్టల్‌లో విద్యార్థి అనుమానాస్పద రీతిలో ఉరి వేసుకొని మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. బెళగావి జిల్లా సవదత్తి తాలూకా హిరేఉల్లిగేరి గ్రామానికి చెందిన ప్రీతం కంప్లి (15) అనే బాలుడు ఉరి వేసుకున్న స్థితిలో కనిపించాడు. విషయం తెలిసిన వెంటనే హాస్టల్‌కు వచ్చిన మృతుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమారుడు తనంత తాను ఉరి వేసుకోలేదని, ఎవరో అతనిపై దాడి చేసి చంపి ఉంటారని బాలుడి తండ్రి అనుమానం వ్యక్తం చేశారు. ఆ మేరకు ధార్వాడ గ్రామీణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.


