రాయచూరు రూరల్: నగరంలో మౌలిక సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేయాలని జిల్లాధికారిణి పూవిత పేర్కొన్నారు. సోమవారం నీరుబావికుంట, రాంపుర తాగునీటి జలాశయం, షియాతలాబ్, యక్లాస్‌పూర్ ప్రాంతాల్లో ఆమె సుడిగాలిలా పర్యటించారు. వర్షాకాలంలో మురుగు కాలువల్లో పూడికను తొలగించి నీరు సజావుగా సాగేలా చూడాలన్నారు. రాంపుర తాగునీటి రిజర్వాయర్‌ను పరిశీలించి నగర ప్రజలకు రక్షిత మంచినీరు అందించాలన్నారు. నీరుబావికుంటలో నగరసభ అధికారులు, సిబ్బంది నిరంతర నిఘా ఉంచి స్వచ్ఛత కాపాడాలన్నారు. చెత్తను రోడ్లలో పారేసే వారిపై జరిమానా విధించాలన్నారు. వర్షా కాలంలో వాన నీరు రోడ్ల పైకి రాకుండా కాలువల్లో ప్రవహించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. యక్లాస్‌పూర్‌లో డంప్ యార్డును తనిఖీ చేశారు. నగర పాలికె కమిషనర్ జుబీన్ మహాపాత్రో, స్వచ్ఛత నోడల్ అధికారి కృష్ణ శావంతగేర, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


