కోలారు: నగరంలోని రంగ మందిరంలో రంగ గోకుల కళాబృందం ఆధ్వర్యంలో నిర్వహించిన కీచక నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. రెండు గంటల నిడివి కలిగిన నాటకం ఆద్యంతం పరవశుల్ని చేసింది. కా.ల. విశ్వనాథ్ రచించిన ఈ నాటకానికి కృష్ణ కశ్యప్ దర్శకత్వం వహించడం మాత్రమే కాకుండా కీచక పాత్రధారిగా నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారు. భీముని పాత్రలో కా.ల. విశ్వనాథ్ నటించారు. వీరిద్దరూ కూడా తండ్రి కొడుకులు కావడం విశేషం. నాటక ప్రదర్శన ద్వారా వచ్చిన ఆదాయాన్ని సేవా సంస్థలకు అందిస్తామని తెలిపారు.
పరప్పన జైలులో రభస
దొడ్డబళ్లాపురం: బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో గొడవలు జరిగాయి. బాంబు పేలుడు కేసులో జైల్లో ఉన్న ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు ఓ మతానికి మద్దతుగా నినాదాలు చేశారు. వారించబోయిన వార్డర్‌పై దాడికి ప్రయత్నించారు. ఇద్దరు ఖైదీలు జైలు ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చారు. సిబ్బంది వారి రికార్డులను తనిఖీ చేస్తుండగా, మతపరమైన నినాదాలు చేస్తూ వార్డర్‌ను కొట్టబోయారు. పేలుళ్ల కేసుల్లో నిందితులైన సుమారు 50 మంది ఖైదీలు అక్కడకు చేరుకుని రభస సృష్టించారు. స్థానిక పోలీసులు చేరుకుని పరిస్థితిని నియంత్రించారు.
చిక్కనంటున్న టమాటా
● కేజీ రూ.60కి చేరిక
యశవంతపుర: టమాటా ధరలు భగ్గుమంటున్నాయి. గత రెండు వారాల నుంచి బెంగళూరు, చుట్టుపక్కల జిల్లాల్లో వానలు పడుతున్నాయి. దీంతో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో రవాణా చార్జీలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులో టమాటా ధర కేజీ రూ.60 పలుకుతోంది. మునగకాయ, బీన్స్ ధరలు తగ్గితే, ఆకుకూరల ధరలకు రెక్కలొచ్చాయి. బీన్స్ గతనెలలో కేజీ రూ.150 ఉండగా ఇప్పుడు రూ.78 కి పడిపోయింది. వంకాయ ధరలు పెరిగాయి. బజ్జి మిరప, దోస, చోళేకాయ, అనప, కాకర, టమాటా, కొత్తిమీర ధరలు ౖపైపెకి వెళ్తున్నాయి. ఇందుకు వర్షాలతో పాటు పెట్రో ధరలు పెరగడం కారణమని వ్యాపారులు చెబుతున్నారు. కూరగాయలను రవాణా చేసే వాహనాల డ్రైవర్లు బాడుగలు పెంచినట్లు చెబుతున్నారు. ఈ ధరలతో గృహిణులు ఇబ్బంది పడుతున్నారు.
వ్యాయామంతో మంచి ఆరోగ్యం
మండ్య: ప్రతి ఒక్కరూ రోజూ కనీసం 20 నిమిషాల పాటు వ్యాయామం లేదా ఆటలలో పాల్గొనడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా పంచాయత్ సీఈఓ కె. ఆర్. నందిని తెలిపారు. ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా జడ్పీ నుంచి బాలలతో ర్యాలీ నిర్వహించారు. శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడం సాధ్యమవుతుందని ఆమె అన్నారు. ఆహారాన్నే ఔషధంగా ఉపయోగించి శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుందామని చెప్పారు. నడక, వ్యాయామం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలమన్నారు. పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అంటు వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చని తెలిపారు.
నగరంలో ఆకాశ వింత
బనశంకరి: బెంగళూరు ఆకాశ వీధుల్లో వింత ఏర్పడింది. రాకెట్ వెళ్తున్నప్పుడు ఏర్పడే పొగ వంటిది కనిపించడంతో జనం ఆశ్చర్యానికి గురయ్యారు. కేఆర్ మార్కెట్ ఫ్లై ఓవర్ వద్ద శుక్రవారం సాయంత్రం కనబడిన దృశ్యాన్ని రాఘవేంద్ర గుడి అనే వ్యక్తితో పాటు కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏదైనా విమానం నుంచి ఆ పొగ ఏర్పడిందా, లేక అంతరిక్ష వాహనం ప్రయాణించిందా అని సందేహాలు వ్యక్తంచేశారు.


