సరస్వతీ నిలయంలో చీడ పురుగులు | - | Sakshi
Sakshi News home page

సరస్వతీ నిలయంలో చీడ పురుగులు

Jun 8 2026 7:00 AM | Updated on Jun 8 2026 7:00 AM

విద్యార్థినులతో కీచక ప్రొఫెసర్‌ తంగదొరై షికార్లు

ధార్వాడలోని కర్ణాటక విశ్వవిద్యాలయం

హుబ్లీ: చదువుల తల్లి నిలయంలో చీడ పురుగులు విద్యార్థినులను కాటేస్తున్నాయి. ధార్వాడలోని కర్ణాటక విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌, అదే విభాగం పీహెచ్‌డీ విద్యార్థినితో ప్రేమాయణం సాగించిన సంఘటనపై అన్ని వైపులా నుంచి విమర్శలు వస్తున్నాయి. చదువులు చెప్పాల్సిన గురువు కూతురు వయసున్న అమ్మాయిని ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడని అనేకమంది మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ ఏఎం ఖాన్‌ నేతృత్వంలో దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు. విద్యార్థులతో ప్రొఫెసర్ల ఇలాంటి నడవడికతో తలెత్తిన విమర్శలపై సదరు బాధ్యుడైన ప్రొఫెసర్‌ దేవరాజ్‌ తంగదొరై నుంచి వివరణ తీసుకున్నారు. అలానే పీహెచ్‌డీ విద్యార్థినిపై కూడా తొలి దశ విచారణను ఇప్పటికే పూర్తి చేశారు.

ఆధారాల సమర్పణ

ప్రొఫెసర్‌ విద్యార్థినితో గడిపిన వీడియోలు, ఆడియోలను కూడా ఫిర్యాదుదారుడైన విద్యార్థి వేదవ్యాస్‌ చౌహాన్‌ వర్సిటీ కమిటీకి అప్పగించారు. దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత చర్యలను చేపడతామని వీసీ మీడియాకు తెలిపారు. తంగదొరై ఆమెతోనే కాదని, అనేకమంది పీహెచ్‌డీ, పీజీ విద్యార్థినులను ప్రేమపేరుతో మభ్యపెట్టి షికార్లు చేసేవాడని విద్యార్థులు ఆరోపించారు. దీనికి సంబంధించి అనేక ఫోటోలు వైరల్‌ అయ్యాయి. దీంతో యూనివర్సిటీలో ఏం జరుగుతోంది అనేది చర్చనీయాంశమైంది.

చదువుకునే వాతావరణం కావాలి

చౌహాన్‌ మాట్లాడుతూ తాను తంగదొరై వద్దే పీహెచ్‌డీ చేసేవాడినని, ఆయన అనుచిత డిమాండ్ల తీర్చలేక ఆయన గుట్టును బయట పెట్టినట్లు తెలిపాడు. వర్సిటీలోని విద్యార్థి సంఘాల నేతలు ఈ వ్యవహారంపై భగ్గుమంటున్నారు. విద్యార్థులు క్షేమంగా చదువుకోవడానికి తగిన వాతావరణం ఉండాలని, విద్యాబోధకులకు నైతిక నియమావళిని ఏర్పరచాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థినీ విద్యార్థులను బోధకులు బెదిరించడం, లైంగిక దోపిడీకి పాల్పడడం క్షమించరాని నేరమని, అటువంటి దుష్కృత్యాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

విద్యార్థినులతో ప్రొఫెసర్‌ ప్రేమాయణాలు

ధార్వాడ కర్ణాటక వర్సిటీలో కలకలం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement