శివాజీనగర: బెంగళూరు ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఇటీవల ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో సీసీ కెమెరాల వైర్లను కట్ చేశారనే వ్యవహారం మలుపు తిరిగింది. సీసీ కెమెరాల నిర్వాహక సంస్థలే తప్పుడు ఆరోపణలు చేశారని తేలింది. గతేడాది తొక్కిసలాట దుర్ఘటన తరువాత హైకోర్టు కఠిన భద్రతా నిబంధనలను పాటించాలని ఆదేశించింది.
ప్రశ్నించడంతో గొడవలు
ఈ నేపథ్యంలో ఆర్‌సీబీ, కేఎస్‌సీఏలు రూ.7 కోట్లతో ఏఐ కెమెరాల ఏర్పాటుకు నిర్ణయించాయి. ఇందులో హర్యానాకు చెందిన సంస్థకు రూ.4.5 కోట్ల టెండర్ ఇచ్చారు, మరికొన్ని కంపెనీలకు కూడా పనులు ఇచ్చారు. ఏఐ కెమెరాల పేరుతో సాధారణ హెడ్ కౌంట్ సామర్థ్యమున్న కెమెరాలను పలు సంస్థలు బిగించి మోసం చేశాయి. దీనిని స్టేడియం సిబ్బంది ప్రశ్నించడంతో ఆయా కంపెనీల సిబ్బంది ఘర్షణ పడ్డారు. కక్ష గట్టి మ్యాచ్ సమయంలో కెమెరాల తీగలను కత్తిరించి రచ్చ చేశారని స్టేడియం వర్గాలు తెలిపాయి. కెమెరాల వ్యవహారంలో కేఎస్‌సీఏ ఐటీ హెడ్ ఒకరు పెద్దమొత్తంలో లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి చర్యల వల్ల చిన్నస్వామి స్టేడియం అప్రతిష్ట పాలవుతోంది. చివరకు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ గుజరాత్‌కు మారడం తెలిసిందే.
చిన్నస్వామి స్టేడియంలో అవకతవకలు
వైర్ల కటింగ్‌తో బట్టబయలు


