జోరుగా ఏరువాక పనులు | - | Sakshi
Sakshi News home page

జోరుగా ఏరువాక పనులు

Jun 8 2026 7:00 AM | Updated on Jun 8 2026 7:00 AM

సాక్షి బళ్లారి: మట్టి వాసన...ఆకాశంలో నల్లటి మేఘాలు... జిల్లా వ్యాప్తంగా అదునులో కురుస్తున్న వర్షాలతో పొలాల వైపు కదులుతున్న ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లు. రైతుల ముఖాల్లో చిరునవ్వులు... ఇవన్ని కలిసి బళ్లారి జిల్లాలో జోరుగా ఏరువాక సందడి కనిపిస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కాగానే అదునులో వరుణదేవుడి కృపా కటాక్షాలతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురువడంతో రైతులు ఖరీఫ్‌కు దుక్కులు దున్నే పనులకు శ్రీకారం చుట్టి జోరుగా కొనసాగిస్తున్నారు. బళ్లారిలో వర్షాధారిత, సాగునీటి భూములు పుష్కలంగా ఉన్నాయి. జిల్లాలోని బళ్లారి, సిరుగుప్ప, కంప్లి, సండూరు తాలూకాల్లో వర్షాధారిత భూములతో పాటు సగానికిపైగా తుంగభద్ర ఆయకట్టు భూములు కూడా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఐదు లక్షల ఎకరాలకు పైగా సాగుభూములు ఉండటంతో వేలాది మంది రైతులు తమ వ్యవసాయ భూములను ఖరీఫ్‌ సీజన్‌కు సిద్ధం చేస్తున్నారు. వర్షాధారితో భూములతో పాటు తుంగభద్ర ఆయకట్టు భూములను కూడా ముందుగానే సిద్ధం చేసుకొని పంటలను పెట్టుకునేందుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. తొలకరి వర్షాలు జోరుగా కురవడంతో గ్రామాల్లో రైతులు మేల్కొని ఎద్దులకు పూజ చేసి, నాగళ్లను భుజాన వేసుకొని పొలాల బాట పట్టిన రైతులు కొందరు కనిపిస్తుండగా మరికొందరు ట్రాక్టర్లతో దుక్కి దున్నేందుకు పొలాల్లో చురుగ్గా ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ఉమ్మడి బళ్లారి జిల్లాలో ప్రధానంగా తుంగభద్ర ఆయకట్టు కింద వరి, మిర్చి, పత్తిపంట సాగు చేసే రైతులు భూములను సిద్ధం చేసుకుంటున్నారు.

ఎద్దులు, ట్రాక్టర్లతో పొలాల్లో దుక్కులు

వర్షాధారిత భూముల్లో సజ్జలు, జొన్నలు, వేరుశెనగ, రాగి, తదితర పంటలను వేసుకునేందుకు ఆ దిశగా రైతులు పొలాలను దుక్కి దున్ని వాటికి ఎరువులను కూడా అందించే ప్రక్రియలో ముందుకు వెళ్తున్నారు. గత ఏడాది ఖరీ్‌ఫ్‌లో నష్టాలు రాకపోయినా పెట్టిన పెట్టుబడులు రావడంతో రైతులు ఉత్సాహంగా ఏరువాక చేపడుతున్నారు. వ్యవసాయ పనులు జోరుగా కొనసాగుతుండటంతో కూలీలకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. రైతులు దుక్కులు దున్నే ప్రక్రియ జోరుగా కొనసాగుతుండటంతో ఖరీఫ్‌ సీజన్‌కు ఎరువులు, విత్తనాలను అన్ని విధాలుగా సిద్ధం చేశామని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నా రైతులు విత్తనాలు, ఎరువులు చేతికి అందే వరకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న రైతులకు ఈ ఏడాది ఎరువుల కొరత లేకుండా అధికారులు చూడాలని రైతన్నలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కాగానే జోరుగా వర్షాలు కురవడంతో జూలైలో విత్తనాలు వేసే సమయంలో వరినాట్లు నాటేటప్పుడు వరుణదేవుడు సకాలంలో వానలు కురవాలని రైతన్నలు కోరుతున్నారు.

పొలంలో దుక్కి దున్నుతున్న రైతన్న

ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతున్న దృశ్యం

రైతన్నల్లో చిగురించిన ఖరీఫ్‌ ఆశలు

తొలవరి వర్షాల రాకతో

ఊపందుకున్న సందడి

పొలాల బాట పట్టిన రైతులు,

వ్యవసాయ కూలీలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement