ఒకే స్కూల్‌లో చదివిన 17 మంది జవాన్లుగా ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ఒకే స్కూల్‌లో చదివిన 17 మంది జవాన్లుగా ఎంపిక

Jun 8 2026 7:00 AM | Updated on Jun 8 2026 7:00 AM

హుబ్లీ: ఉప్పినబెటగేరి గురు విరుపాక్షేశ్వర హైస్కూల్‌లో చదివిన 17 మంది యువకులు జవాన్లుగా ఎంపికయ్యారు. ఒకే పాఠశాలలో చదివిన ఇంత మంది విద్యార్థులు ఏకకాలంలో సైనికులుగా దేశ సేవకు వెళ్లడంపై ఆ గ్రామస్తుల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. ఉప్పినబెటగేరి చుట్టు పక్కల గ్రామాలకు చెందిన అనేక మంది యువకులు ఇప్పటికే అగ్నివీరులుగా దేశ వ్యాప్తంగా సేవలందిస్తున్నారు. ఈ నెల 2న వెల్లడైన జాబితాలో ఈ పాఠశాలలో చదివిన ఉప్పినబెటగేరి, కల్లూరు, హనుమనాళ గ్రామాలకు చెందిన మొత్తం 17 మంది యువకులు అగ్నివీరులుగా ఎంపికై ఆయా గ్రామాల కీర్తిని ఇనుమడింపజేశారు. ఉప్పినబెటగేరి నుంచి ఏడుగురు, కల్లూరు నుంచి ఆరుగురు, హనుమనాళ నుంచి నలుగురు ఎంపికై నట్లు మూరుసావిర విరక్త మఠం కుమార విరుపాక్ష స్వామి హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలోని అనేక మంది యువకులు దేశ సేవకు ఎంపికవడం ఆ గ్రామస్తుల దేశభక్తికి నిదర్శనం అని, రైతులు, సైనికులు దేశానికి రెండు కళ్లు లాంటి వారని అన్నారు.

వేధింపులు తాళలేక మహిళ బలవన్మరణం

హుబ్లీ: స్నానం చేస్తున్న మహిళ ఫోటో, వీడియోలను చిత్రీకరించుకుని వేధించడమే కాకుండా రూ.17 లక్షల నగదు వసూలు చేసిన నేపథ్యంలో జీవితంపై విరక్తి చెందిన ఆ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరంలోని ఉణకల్‌లో జరిగింది. వివరాలు.. సుధ మృతురాలు. సిద్దారూఢ, అరుణ, మీనాక్షి, మల్లికార్జున, వీరప్ప, ప్రకాష్‌, బసవలింగప్ప, శివానంద, గిరిజాలపై కేసు నమోదైంది. సుధ ప్రస్తుతం ఉణకల్‌లో నివసిస్తూ సవదత్తి మునవళ్లిలో అంగన్‌వాడీ టీచర్‌గా పని చేస్తోంది. రెండేళ్ల క్రితం ఇంట్లో స్నానం చేస్తుండగా ఫొటో, వీడియో తీసుకొని ఆమైపె నిందితులు వేధింపులకు పాల్పడి ఆమె నుంచి క్రమంగా రూ.17 లక్షల మేర వసూలు చేశారు. అంతేగాక చెక్‌ బౌన్స్‌ కేసులో సవదత్తి కోర్టు ద్వారా కూడా ఆమెను మనోవేదనకు గురి చేశారు. వారి వేధింపులు భరించలేక ఉణకల్‌లోని అద్దె ఇంట్లో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు విద్యానగర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

260 క్వింటాళ్ల

రేషన్‌ బియ్యం స్వాధీనం

హొసపేటె: తాలూకాలోని మరియమ్మనహళ్లి పోలీసులు అక్రమంగా రవాణా చేస్తున్న 260.35 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. గదగ్‌ నుంచి మండ్య, తుమకూరు జిల్లాల వైపు కేఏ–14 ఏ–8680 నెంబర్‌ గల లారీలో రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు తమకు అందిన నిర్దిష్ట సమాచారం మేరకు ఆహార, పౌర సరఫరాల శాఖ అధికారులు, మరియమ్మనహళ్లి స్టేషన్‌ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి లారీతో సహా సుమారు రూ.6.04 లక్షల విలువైన రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై మరియమ్మనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వీధి వ్యాపారుల

సంక్షేమానికి కృషి

రాయచూరు రూరల్‌: వీధి వ్యాపారుల సంక్షేమానికి పాటు పడాలని రాష్ట్ర వీధి వ్యాపారుల సంక్షేమాభివృద్ధి సమితి అధ్యక్షుడు అతిక్‌ పాటిల్‌ పేర్కొన్నారు. పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో ఏర్పాటు చేసిన వీధి వ్యాపారుల సమ్మేళనాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. దేశంలో ఆర్థిక లావాదేవీల్లో వీధి వ్యాపారుల పాత్ర కీలకమన్నారు. సర్కార్‌ వీధి వ్యాపారులకు తగిన భద్రత, రక్షణ, మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రాజ్‌ కుమార్‌, భాస్కర్‌ బాబు, శ్రీనివాస్‌, గోపినాథ్‌, రఫీ, మౌలాలి, సోనమ్మ, అమీనా, మరియప్ప, పుట్టరాజు, యేసుమిత్ర, కుప్పణ్ణ, ప్రకాష్‌ ప్రవీణ్‌లున్నారు.

విత్తనాలు, ఎరువుల

కొరత తలెత్తనీయొద్దు

రాయచూరు రూరల్‌: ఈసారి ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో రైతులకు ఎలాంటి విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా చూడాలని వ్యవసాయ శాఖ అధికారి నయీం హుసేన్‌ అధికారులకు సూచించారు. రాయచూరు జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర పథకం కింద రైతులకు విత్తనాలు పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఖరీఫ్‌లో ముందుగానే వానలు కురిశాయని, రైతులు విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకుంటున్న తరుణంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లభించే సబ్సిడీ పథకాలను రైతులు సద్వినియోగపరచుకోవాలని కోరారు. వ్యవసాయ శాఖాధికారిణి దీపా, రైతు లక్ష్మణగౌడ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement