రోడ్డు విస్తరణ చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు విస్తరణ చేపట్టాలి

Jun 7 2026 8:42 AM | Updated on Jun 7 2026 8:42 AM

రాయచూరు రూరల్‌: నగరంలోని రాజేంద్ర గంజ్‌ రహదారిలోని చంద్ర బండ రోడ్డును విస్తరించాలని జయ కర్ణాటక సేన నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు శనివారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. సంఘం సంచాలకురాలు జాఫర్‌ ఫరీఫ్‌ మాట్లాడుతూ చంద్రబండ సర్కిల్‌ పరిధిలోని 28, 29, 30 వార్డుల మీదుగా 15 గ్రామాలకు రాకపోకలు జరుగుతాయన్నారు. చంద్రబండ రోడ్డు హైదరాబాద్‌ జాతీయ రహదారికి అనుసంధానమై ఉందని, దీనికితోడు ఈ రోడ్డులో వ్యాపార కేంద్రాలు, బియ్యం మిల్లు లు, ఓపెక్‌, రిమ్ష్‌ అస్పత్రలు ఉన్నాయన్నారు. దీంతో ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుందన్నారు. అయితే రోడ్లు చిన్నవిగా ఉండటంతో ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోందన్నారు. అధికారులు స్పందించి రోడ్డును వెడల్పు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

గుండెపోటుతో

యువకుడి మృతి

రాయచూరు రూరల్‌: గుండె పోటుతో యువకుడు మృతి చెందాడు. గయాదగిరి జిల్లా సురుపురకు చెందిన మరు కలబుర్గి (25) ధార్వాడలో ఉంటూ పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్నాడు. అక్కడే ఒక గదిని అద్దెకు తీసుకున్నాడు. శుక్ర వారం రాత్రి గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు.

విద్యతోనే సమాజంలో గుర్తింపు

రాయచూరు రూరల్‌: నేటి విద్యార్థులు ఉన్నత విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలు వేదవతి సూచించారు. రాయచూరు తాలూకా జేగరకల్‌ ప్రభుత్వ హైస్కూల్‌లో శనివారం ఆమె విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు అందించి మాట్లాడారు. సమకాజంలో విద్యకు ఉన్న ప్రాధాన్యత ఏ రంగానికీ లేదన్నారు.విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు మంజునాథ్‌, తోటమ్మ పాల్గొన్నారు.

అప్పుల బాధతో

కారు డ్రైవర్‌ ఆత్మహత్య

రాయచూరు రూరల్‌: అప్పులు తీర్చాలని బ్యాంకు అధికారులు ఒత్తిడి చేయడంతో కారు డ్రైవర్‌ అత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాదగిరి జిల్లాలో జరిగింది. యాదగిరి జిల్లా సురుపుర తాలూకా కాచాపురు గ్రామానికి చెందిన సోమప్ప(30) ప్రైవేటు బ్యాంకులో రూ.15 లక్షల రుణం తీసుకొని కారు కొనుగోలు చేసి అద్దెలకు తిప్పుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కంతులు కట్టడంలో జాప్యం జరగడంతో బ్యాంకు అధికారులు ఒత్తిడి చేశారు. కంతు కట్టకపోతే వాహనాన్ని తీసుకెళ్తామని హెచ్చరించారు. దీంతో శుక్రవారం తన ఇంటిలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు దర్యాప్తులో ఉంది.

ఊపందుకున్న వ్యవసాయ పనులు

హొసపేటె: రుతుపవనాల రాకతో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు ఎంతో ఉత్సాహంగా వ్యవసాయ పనులు మొదలు పెట్టారు. ఇప్పటికే భూమిని చదును చేసుకున్న రైతులు విత్తనాలు వేయడం ప్రారంభించారు. జొన్న, పొద్దుతిరుగుడు, వరి, సజ్జ వంటి వర్షాకాలపు పంటలను విత్తడంలో నిమగ్నమయ్యారు. హొసపేటె తాలూకాలో 60,493 హెక్టార్లు ఉండగా 48,753 హెక్టార్లు సాగుకు అనుకూలంగా ఉంది. ప్రస్తుత 17,620 హెక్టార్లలో సాగు జరుగుతోంది. పెద్ద రైతులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. విత్తనాలు నాటడానికి యంత్రాలను ఉపయోగిస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయ పనులకు ఎద్దులను ఉపయోగించి జొన్న, పొద్దుతిరుగుడు, వరి, సజ్జ విత్తనాలు నాటుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement