టీకా.. చకచకా | - | Sakshi
Sakshi News home page

టీకా.. చకచకా

Jun 15 2026 4:28 AM | Updated on Jun 15 2026 4:28 AM

● హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌లో జిల్లాకు 9వ స్థానం ● 9,935 మంది లక్ష్యం కాగా...3,108 మందికి వ్యాక్సిన్‌ ● జిల్లాలో 31 శాతం పూర్తయిన టీకా ప్రక్రియ

కరీంనగర్‌: మహిళల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే వ్యాధుల్లో గర్భాశయ ముఖద్వార కేన్సర్‌ (సర్వికల్‌ కేన్సర్‌) ప్రధాన సమస్యగా మారుతోంది. దీని నివారణ కోసం ప్రభుత్వం బాలికలకు హ్యూమన్‌ పాపిలోమ వ్యాక్సిన్‌ (హెచ్‌పీవీ) వ్యాక్సిన్‌ అందిస్తోంది. ఈ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా మార్చి 8న ప్రారంభించగా, జిల్లా గణనీయమైన పురోగతిని సాధించి, రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచింది. లక్ష్యంగా గుర్తించిన బాలికల్లో ఇప్పటికే మూడొంతుల మందికి టీకా అందించడమే ఈ విజయానికి కారణంగా అధికారులు పేర్కొంటున్నారు.

9,935 మందిలో 3,108 మందికి టీకా పూర్తి

జిల్లా వైద్యారోగ్యశాఖ గణాంకాల ప్రకారం 14 నుంచి 15 ఏళ్ల వయస్సు గల మొత్తం 9,935 మంది బాలికలను హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ కోసం గుర్తించారు. ఇప్పటివరకు 3,108 మందికి వ్యాక్సిన్‌ విజయవంతంగా ఇవ్వబడింది. ఇది దాదాపు 31శాతం పురోగతిని సూచిస్తోంది. టీకా కార్యక్రమం ప్రభుత్వ ప్రధా న ఆసుపత్రులతో పాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో చేపడుతున్నారు. ప్రత్యేక వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లు, పాఠశాల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా లక్ష్యాన్ని చేరుకునేందుకు వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది.

కేన్సర్‌ నివారణలో కీలక పాత్ర

హెచ్‌పీవీ వైరస్‌తో గర్భాశయ ముఖద్వార కేన్సరే కాకుండా మరికొన్ని ప్రమాదకర కేన్సర్లు వచ్చే అవకాశముంది. ఈ వైరస్‌ ప్రభావాన్ని ముందుగానే అరికట్టేందుకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్‌ తీసుకోవడం ద్వారా దీర్ఘకాలిక రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుంది. ఫలితంగా గర్భాశయ ముఖద్వార కేన్సర్‌తో పాటు సుమారు ఆరు రకాల కేన్సర్ల ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

తల్లిదండ్రుల్లో అవగాహన

ప్రారంభ దశలో కొంత సందేహం ఉన్నప్పటికీ ప్రస్తుతం హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై ప్రజల్లో అవగాహన పెరిగింది. వైద్యారోగ్యశాఖ అధికారులు పాఠశాలలు, గ్రామస్థాయిలో వ్యాక్సిన్‌ ప్రాధాన్యతను వివరించడంతో తల్లిదండ్రులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. బాలికల భవిష్యత్‌, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ టీకా అత్యంత అవసరమని అధికారులు చెబుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement