సాక్షి ప్రతినిధి, కాకినాడ: సముద్రంలో వేట నిషేధం అమలులో ఉన్న సమయంలో మత్స్యకారులకు అందిస్తున్న భృతిని రూ.10 వేల నుంచి రూ.20 వేలు చేస్తామని గత సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు అండ్ కో గొప్పగా చెప్పారు. గద్దెనెక్కిన తొలి ఏడాదే అంటే 2024లో వేట నిషేధ భృతిని పూర్తిగా ఎగ్గొట్టేశారు. గత సంవత్సరం అరకొరగా విదిల్చి, చేతులు దులిపేసుకున్నారు. సవాలక్ష కొర్రీలతో కోతలు పెట్టారు. చంద్రబాబు సర్కారు తీరుపై మత్స్యకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
61 రోజులు నిషేధం
బంగాళాఖాతంలో చేపల వేటపై నిషేధం ఈ ఏడాది ఏప్రిల్ 15న అమలులోకి వచ్చింది. సముద్రంలో చేపల పునరుత్పత్తి కోసం ఏటా 61 రోజుల పాటు వేట నిషేధం అమలు చేస్తున్నారు. ఆ సయయంలో ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులకు ప్రభుత్వం చాలా ఏళ్లుగా వేట నిషేధ భృతి అందిస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఈ భృతి రూ.10 వేలు ఉండగా.. దీనిని రూ.20 వేలకు పెంచుతామని ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రకటించారు. పెంపుదల అయితే చేశారు కానీ, రకరకాల సాకులతో లబ్ధిదారుల సంఖ్యలో కోత పెట్టారు. ఈ ఏడాది నిషేధం శనివారం అర్ధరాత్రితో ముగిసిపోతోంది. అయినప్పటికీ ఇస్తామన్న భృతిని ప్రభుత్వం ఇప్పటి వరకూ అందించలేదు.
కోత పెట్టారిలా..
వేట నిషేధ భృతి లబ్ధిదారులను గుర్తించేందుకు ఏప్రిల్ 18న సర్వే (బోట్లు, మత్స్యకారుల నమోదు) నిర్వహించారు. కాకినాడ జిల్లాలో తొండంగి నుంచి తాళ్లరేవు వరకూ ఆరు సముద్ర తీర మండలాల్లోని 58 మత్స్యకార గ్రామాల్లో 1,95,184 మంది మత్స్యకారులున్నారు. వీరిలో 27,070 మంది 387 మెకనైజ్డ్ బోట్లు, 3,826 మోటారైజ్డ్ బోట్లు, 389 సంప్రదాయ ఇంజిన్ లేని బోట్లపై సముద్రంలో చేపల వేట సాగిస్తూ ఉపాధి పొందుతున్నారు. ప్రాథమికంగా గుర్తించిన ఈ 27,070 మందిలో సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ నిబంధనల పేరిట 2,140 మందిని తొలగించి, లబ్ధిదారుల సంఖ్యను 24,930కి తగ్గించేశారు. అలాగే, కోనసీమ జిల్లాలో 483 మంది మత్స్యకారులకు కోత పెట్టారు. సముద్రంలో వేటకు వెళ్లే మెకనైజ్డ్ బోట్లకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ డీజిల్ వినియోగించ లేదనే సాకుతో సైతం ఎగనామం పెట్టారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా దాదాపు 3 వేల మంది మత్స్యకారులకు సుమారు రూ.6 కోట్ల మేర వేట నిషేధ భృతిని ప్రభుత్వం ఎగ్గొట్టింది. నిషేధ సమయంలో నిజాయితీగా సముద్రంలో వేటకు వెళ్లకుండా ఇళ్ల వద్దనే కూర్చున్నందుకు చంద్రబాబు సర్కారు తమకు తగిన గుణపాఠమే చెప్పిందని మత్స్యకారులు మండిపడుతున్నారు. వేట నిషేధ భృతి కోసం కాకినాడ సహా పలు ప్రాంతాల్లోని మత్స్యశాఖ కార్యాలయాల వద్ద మత్స్యకారులు ఆందోళనకు దిగారు. ఆ సమయంలో సమస్య పరిష్కరిస్తామన్న అధికారులు ఇప్పుడు పత్తా లేకుండా పోయారని వారు మండిపడుతున్నారు. రెండో విడతలో తమ జాబితాకు అనుమతి వస్తుందని నమ్మించి, వేట నిషేధ గడువు ముగిసే సమయానికి చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా ప్రభుత్వం అన్యాయం చేసిందని వాపోతున్నారు.
వేటపై ముగిసిన నిషేధం
మత్స్యకారులకు భృతి ఇవ్వని ప్రభుత్వం
కొర్రీలు పెట్టి కోతలు
3 వేల మందికి
రూ.6 కోట్ల మేర ఎగనామం
నేడు సముద్రంలో వేట పునఃప్రారఃభం


