కన్నూమన్ను కానకుండా.. | - | Sakshi
Sakshi News home page

కన్నూమన్ను కానకుండా..

Jun 14 2026 7:22 AM | Updated on Jun 14 2026 7:22 AM

కరప: ‘అధికారం మాది.. మమ్మల్నెవడ్రా ఆపేది?’ అంటూ కూటమి నాయకులు మట్టి మాఫియా అవతారమెత్తారు. కన్నూమిన్నూ కానకుండా దొరికిన చోటల్లా మట్టి కొల్లగొడుతున్నారు. దేవస్ధానం భూములు.. పంట కాలువ, మురుగు కాలువ గట్లపై యథేచ్ఛగా మట్టి తవ్వేస్తూ రాత్రికి రాత్రే తరలించుకుని పోయి, సొమ్ము చేసుకుంటున్నారు. మండల కేంద్రమైన కరప వేణుగోపాలస్వామి, రామలింగేశ్వరస్వామి ఆలయాలకు చెందిన భూముల్లో ఇటీవల వెయ్యి ట్రాక్టర్లకు పైగా మట్టి తరలించుకుపోయారు. పేపకాయలపాలెంలో ఇరిగేషన్‌, మురుగు కాలువ గట్లను తవ్వేసి, ఆ మట్టిని అమ్మేసుకున్నారు. ఈ వ్యవహారంలో సుమారు ఆరేడు లక్షల రూపాయలు వెనకేసుకుని ఉంటారని రైతులు ఆరోపిస్తున్నారు. మట్టి మాఫియా ఆగడాలపై ‘సాక్షి’ ఇటీవల కథనాలు ప్రచురించింది. అప్పట్లోనే అధికారులు స్పందించకపోవడంతో మాఫియా మరింత చెలరేగిపోతోంది.

తెర వెనుక ‘ఆ నలుగురు..’

తాజాగా దేవదాయ శాఖ భూమిలోని మట్టిని కూటమి నాయకులు రూ.15 లక్షలకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. దేవదాయ శాఖ పరిధిలోని కాకినాడ పైండా వారి సత్రానికి నడకుదురులో 7.50 ఎకరాల పంట భూమి ఉంది. ఇందులోని 3 కుంచాల దిబ్బను ఓ రైతు కౌలుకు చేస్తున్నారు. ఆ మట్టి దిబ్బపై కూటమి నాయకుల కన్ను పడింది. అక్కడి నుంచి 10 ట్రాక్టర్ల మట్టిని పల్లపు ప్రాంతంలో వేసుకోవడానికి అనుమతించాలంటూ ఆ కౌలు రైతుతో దేవదాయ అధికారులకు విజ్ఞప్తి చేయించారు. దీనికి అధికారులు కూడా అనుమతించారు. అంతే.. గురువారం రాత్రికి రాత్రే 3 కుంచాల దిబ్బను తవ్వేందుకు 6 జేసీబీలు, మట్టిని తరలించేందుకు 20 ట్రాక్టర్లు ఏర్పాటు చేశారు. నలుగురు కూటమి నాయకులు తెర వెనుక ఉండి ఈ తతంగమంతా నడిపించారు. ఈ భూమి పక్కనే ఒక నాయకుడు ఏడెకరాల పంట భూమిని పూడ్చి, లే అవుట్‌ వేస్తున్నాడు. అతడితో కూటమి నాయకులు డీల్‌ కుదుర్చుకుని గురువారం రాత్రి మట్టి తవ్వకం ప్రారంభించారు. మట్టి తవ్వకం విషయం తెలుసుకున్న నడకుదురు మాజీ ఎంపీటీసీ సభ్యుడు పబ్బినీడి చక్రరావు రాత్రి వేళ అక్కడకు వెళ్లి రహస్యంగా ఫొటోలు తీశారు. అది పసిగట్టిన కూటమి నాయకులు వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. అప్పటికే కుంచెడు విస్తీర్ణంలోని మట్టిని తరలించేశారు. లే అవుట్‌లో వేసిన మట్టి కనబడకుండా శుక్రవారం ఉదయానికల్లా గ్రావెల్‌తో కప్పేశారు. దేవదాయ శాఖ భూమిలోని పల్లపు ప్రాంతంలో అక్కడక్కడ నాలుగైదు ట్రాక్టర్ల మట్టి వేయించారు. చూస్తున్న వారికి దేవస్ధానం భూమిలో మిట్టపల్లాలు సరి చేస్తున్నట్లు కనిపించేలా కవరింగ్‌ ఇచ్చారు. విషయం రచ్చ అవడంతో రెవెన్యూ అధికారులు మొక్కుబడిగా దేవస్ధానం భూములు పరిశీలించి, అంతా బాగానే ఉందని, మట్టి అమ్మకాలు అసలు జరగలేదని ప్రకటించి, చేతులు దులిపేసుకున్నారు. విచిత్రంగా వారు కూటమి నాయకులను వెంట పెట్టుకుని పరిశీలనకు వెళ్లడం గమనార్హం.

అధికారులు స్పందించరేం?

సాధారణంగా దేవస్ధానం భూముల సాగుకు బహిరంగ వేలం పాట నిర్వహించేటప్పుడు ఎలా ఉన్న భూమిని అలాగే సాగు చేసుకోవాలనే నిబంధన ఉంటుంది. అందులోని మట్టి తవ్వినా, పొలం గట్లపై చెట్లు నరికినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తారు. ఆ మేరకు పైండా సత్రం భూమిలో మట్టి తవ్వి, అమ్మేసుకున్న కౌలు రైతుపై దేవదాయ అధికారులు చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ఆ రైతు కౌలును రద్దు చేసి, తిరిగి వేలం నిర్వహించాలి. కానీ, కూటమి నాయకులకు అధికారులు వత్తాసు పలకడం విమర్శలకు తావిస్తోంది.

మట్టి మాఫియా ఆగడాలు

దేవదాయ భూమిలో యథేచ్ఛగా తవ్వకాలు

కూటమి నాయకుల

బరితెగింపు

పట్టించుకోని అధికారులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement