సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆడబిడ్డ నిధికి మంగళం పాడిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు త్వరలో మహిళలే బుద్ధి చెబుతారని వైఎస్సార్ సీపీ మహిళా నేతలు హెచ్చరించారు. ఆడబిడ్డ నిధికి నిధులు లేవని తిరుపతి సభలో చంద్రబాబు స్పష్టం చేసిన నేపథ్యంలో కాకినాడలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్, పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్, పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి శనివారం మీడియా సమావేశంలో స్పందించారు. విజనరీ అని, సంపద సృష్టిస్తానని చెప్పుకుంటూ గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబుకు.. గద్దెనెక్కి రెండేళ్లు దాటిపోతున్నా ఆడబిడ్డ నిధి అమలు చేత కాలేదని విమర్శించారు. ఇప్పుడు నిధుల్లేవంటూ యూటర్న్ తీసుకుని మరో మోసానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా సున్నా వడ్డీ అంటూ అలవి కాని హామీలతో మహిళలను ఓటు బ్యాంక్ రాజకీయాలకు వినియోగించుకుని, మోసం చేశారని విమర్శించారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనా తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేయకపోవడం అన్యాయమన్నారు. సంపద సృష్టించడం సంగతలా ఉంచితే, అప్పుల్లో చంద్రబాబు ప్రపంచ రికార్డు సృష్టించారని విమర్శించారు. కోట్లాది రూపాయల అప్పులు చేస్తున్నా మహిళలకు కనీసం ఒక్క పథకం కూడా అమలు చేయకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేస్తున్న అప్పులు ఎక్కడికి పోతున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో పెట్టిన ఒక్క పథకాన్ని కూడా చంద్రబాబు సక్రమంగా అమలు చేయని విషయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. ఉచిత గ్యాస్ అరకొరగానే అమలు చేశారని గుర్తు చేశారు. ఎన్నికల ముందు కల్లబొల్లి హామీలతో నమ్మించి, అధికారంలోకి వచ్చాక మహిళలకు వెన్నుపోటు పొడిచారని, ప్రతిసారీ చంద్రబాబు చేస్తున్న మోసాలను మహిళలు గమనిస్తున్నారని అన్నారు. రెండేళ్లు సక్రమంగా పాలించలేని చంద్రబాబు మిగిలిన మూడేళ్లు ఏవిధంగా పాలన సాగిస్తారో ప్రజలకు అంతుబట్టనిదిగా ఉందన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే కాకుండా, అధికారంలోకి వచ్చాక చెప్పని పథకాలను సైతం అమలు చేసి, మహిళల ఆర్థికాభివృద్ధి, సంక్షేమానికి కృషి చేసిన ఏకై క ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని చెప్పారు. దగా పడిన ఆడబిడ్డకు ఆయన మాత్రమే న్యాయం చేస్తారన్నారు. అబద్ధాలు చెప్పి, మోసం చేసి గద్దెనెక్కిన చంద్రబాబుకు ప్రజలు 2029లో బుద్ధి చెప్పి జగన్‌ను అధికారంలోకి తీసుకురావడం ఖాయమని వైఎస్సార్ సీపీ మహిళా నేతలు స్పష్టం చేశారు.
‘ఆక్వా’ సేవకు
జాతీయ స్థాయి అవార్డు
కాకినాడ రూరల్: నగరానికి చెందిన ఆక్వా నిపుణుడు, గోదావరి ఆక్వా గ్లోబల్ గ్రూప్ వ్యవస్థాపకుడు పీడీబీఎస్‌ఎన్ వెంకటేశ్వరరావుకు బెస్ట్ ఆక్వాకల్చర్ టెక్నికల్ అవేర్‌నెస్ అవార్డు–2026 లభించింది. ఆక్వా రైతులకు సాంకేతిక అవగాహన కల్పించడం, ఆధునిక సాగు పద్ధతులను ప్రోత్సహించడం, రొయ్యలు, చేపల సాగులో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి నిరంతర మార్గదర్శకత్వం అందించడం, పరిశ్రమకు సంబంధించిన కీలక సమాచారాన్ని రైతులకు చేరవేయడంలో చేసిన కృషికి గాను ఈ అవార్డు అందజేశారు. భీమవరంలో జరిగిన ఆక్వా ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్స్–2026 కార్యక్రమంలో ఈ అవార్డును ఆయన అందుకున్నారు. గోదావరి ఆక్వా గ్లోబల్ గ్రూప్ ద్వారా వేలాది మంది రైతులు, ఆక్వా టెక్నీషియన్లు, పరిశ్రమకు చెందిన వ్యక్తులకు సాంకేతిక సమాచారం, అవగాహన సందేశాలు, వ్యాధి నివారణ సూచనలు, మార్కెట్ విశ్లేషణలు, నిపుణుల సలహాలు అందిస్తూ ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. వెంకటేశ్వరరావును రాష్ట్రంలోని పలువురు ఆక్వా రైతులు, పరిశ్రమ ప్రముఖులు అభినందించారు.


