రత్నగిరిపై ఎట్టకేలకు వైద్య సేవలు | - | Sakshi
Sakshi News home page

రత్నగిరిపై ఎట్టకేలకు వైద్య సేవలు

Jun 14 2026 7:22 AM | Updated on Jun 14 2026 7:22 AM

అన్నవరం: సత్యదేవుని భక్తులకు ఎట్టకేలకు రత్నగిరిపై వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. రత్నగిరిపై వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. కొంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో రత్నగిరిపై వైద్య సేవల ఆవశ్యకతను వెలుగులోకి తెచ్చేలా ‘దివ్యక్షేత్రం.. వైద్యం పూజ్యం!’ శీర్షికన ఈ నెల 5న ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించింది. దీనిపై అన్నవరం దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు స్పందించారు. ప్రతి రోజూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ దేవస్థానం వైద్యాధికారి వంశీకృష్ణతో పాటు ఇద్దరు నర్సులలో ఒకరు షిఫ్టుల వారీగా రత్నగిరిపై భక్తులకు సేవలందించాలని ఆదేశించారు. ఈ ఆదేశాలు తక్షణం అమలులోకి రావడంతో డాక్టర్‌ వంశీకృష్ణ, సీనియర్‌ నర్సు సరోజిని శనివారం రామాలయం ఎదురుగా కార్పొరేట్‌ ఆసుపత్రికి కేటాయించిన హెల్త్‌ సెంటర్‌లో సేవలందించారు.

శాశ్వత వైద్యశాల మేలు

రత్నగిరిపై వైద్య సేవలు అందుబాటులోకి తీసుకుని రావడం బాగానే ఉన్నప్పటికీ.. భక్తులకు 24 గంటలూ అందుబాటులో ఉండేలా శాశ్వత ప్రాతిపదికన ఆసుపత్రి ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. వాస్తవానికి భక్తులకు ప్రథమ చికిత్స అందించేందుకు రత్నగిరి రామాలయం ఎదురుగా కార్పొరేట్‌ ఆసుపత్రికి గది కేటాయించడంపై విమర్శలున్నాయి. కొన్నిసార్లు దేవస్థానంలోను, మరికొన్నిసార్లు ఆసుపత్రికి తరలించగానే భక్తులు మృతి చెందుతున్నారు. అక్కడే పలువురు భక్తులు సేద తీరుతారు. అక్కడే ప్రసాదాల విక్రయ కేంద్రం ఉంది. అటువంటి చోట మృతులను తరలించడం కొంత ఇబ్బందితో కూడుకున్న పని. ఇలా జరిగినప్పుడు సంప్రోక్షణ చేయాల్సి ఉంటుంది. అందువలన ప్రకాష్‌ సదన్‌ సత్రం వెనుక స్థలంలో శాశ్వత ఆసుపత్రి నిర్మిస్తే సత్యగిరి, రత్నగిరికి అందుబాటులో ఉంటుందనే అభిప్రాయం వస్తోంది. ఇది ఆలయానికి దూరంగా ఉండటం వలన ఎవరైనా మృతి చెందినా ఘాట్‌ రోడ్డు ద్వారా దిగువకు తీసుకువెళ్లే వెసులుబాటు ఉంటుంది. ఇదిలా ఉండగా దేవస్థానం వైద్యుడిని మధ్యాహ్నం వరకూ రత్నగిరిపై పని చేయాలని ఆదేశించడంతో ఆ సమయంలో కొండ దిగువన మరో వైద్యుడిని నియమించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement