రంపచోడవరం: నిర్వహణ తీరుపై పలు ఆరోపణలు, భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా గోదావరిలో పర్యాటక బోట్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. రంపచోడవరం ఆర్‌డీఓ కె.స్వాతి శనివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. కలెక్టర్ కె.దినేష్ కుమార్ ఆదేశాల మేరకు పర్యాటక బోట్ల ఫిట్‌నెస్, సాంకేతిక పరిస్థితి, ప్రయాణికుల సామర్థ్యం, భద్రతా ప్రమాణాలు, లైఫ్ జాకెట్లు, అత్యవసర రక్షణ పరికరాలు, పర్యాటకుల భద్రతకు తీసుకున్న చర్యలు తదితర అంశాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నామని తెలిపారు. రెవెన్యూ, పోలీసు, పర్యాటక, మత్స్యశాఖ, విపత్తు నిర్వహణ, ఇరిగేషన్ శాఖల అధికారులతో కూడిన బృందం ఈ తనిఖీలు నిర్వహిస్తుందన్నారు. ఆ బృందం నివేదిక ఆధారంగా అన్ని భద్రతా ప్రమాణాలూ పాటిస్తున్నట్లు నిర్ధారణ అయిన అనంతరం, సంబంధిత బోట్లకు అనుమతులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని, తనిఖీలు పూర్తయ్యే వరకూ గోదావరిలో పర్యాటక బోట్లు నడపరాదని యాజమాన్యాలను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్‌డీఓ స్వాతి హెచ్చరించారు.


