ప్రతిపాదనలు పంపించాం
జిల్లాలో గత ఏడాది పలువురు మహిళలు టైలరింగ్ శిక్షణ పొంది, పరీక్షలు కూడా రాశారు. 75 శాతం హాజరున్న వారికి ఉచితంగా కుట్టు మెషీన్లు అందజేయాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. బడ్జెట్ విడుదల చేస్తే త్వరలోనే పంపిణీ చేసే అవకాశముంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన తర్వాత ట్రైనర్లకు, ఆపరేటర్లకు వేతన బకాయిలు అందజేస్తాం.
– శ్రీనివాస్, బీసీ కార్పొరేషన్ ఈడీ, కాకినాడ
ఫ టైలరింగ్ శిక్షణ పేరుతో ఆర్భాటం
ఫ ఉచితంగా కుట్టు మెషీన్లుఇస్తామంటూ గొప్పలు
ఫ శిక్షణ ఇచ్చి చేతులు దులుపేసుకున్న ప్రభుత్వం
ఫ ఏడాదైనా అందని కుట్టు మెషీన్లు
ఫ మహిళల ఆగ్రహం
పిఠాపురం: మహిళలు స్వయం శక్తితో ఎదిగేందుకు కుట్టు శిక్షణ ఇచ్చి, ఉచితంగా మెషీన్లు ఇస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటం చేసింది. ఆ మాటలను నమ్మి వేలాది మంది మహిళలు ఎంతో ఆశతో శిక్షణ పొందారు. తీరా చూస్తే ప్రభుత్వం శిక్షణతో సరిపెట్టేసి, కుట్టు మెషీన్లు ఇవ్వకుండా చేతులు దులుపేసుకుంది. ఇదంతా చంద్రబాబు మార్కు కట్టు కథలా ఉందంటూ ప్రభుత్వ తీరుపై మహిళలు మండిపడుతున్నారు.
రెండు విడతలుగా..
బీసీ కార్పొరేషన్, ఈడబ్ల్యూఎస్ శాఖల ఆధ్వర్యాన బీసీ, ఆర్థికంగా వెనుక బడిన తరగతి (ఈబీసీ), కమ్మ, రెడ్డి, క్షత్రియ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, కాపు సామాజికవర్గాల్లో అర్హులైన మహిళలకు 2024–25 కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గత ఏడాది ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చారు. దీనికోసం సెంటర్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (సీయూఆర్‌డీ), సోషల్ ఏజెన్సీ ఫర్ పీపుల్స్ ఎంపవర్‌మెంట్ (ఎస్‌ఏపీఈ) ఆధ్వర్యాన శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో ఒక ట్రైనర్, ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ను నియమించారు. శిక్షణ, కేంద్రం అద్దె, కుట్టు మెషీన్, ఇతర పరికరాల కోసం ఒక్కో మహిళకు సుమారు రూ.22 వేల చొప్పున కేటాయించారు. దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ రెండు విడతలుగా పలువురు మహిళలు ఆయా కేంద్రాల్లో శిక్షణ పొందారు.
మెషీన్లు ఇవ్వకుండా పరీక్షలు
నాలుగు నెలల శిక్షణ పూర్తి చేసుకున్న వెంటనే 75 శాతం హాజరు నమోదైన మహిళలకు సర్టిఫికెట్‌తో పాటు ఉచితంగా కుట్టు మెషీన్ అందజేస్తామని అప్పట్లో ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. కానీ అలా జరగలేదు. పైగా 75 శాతం హాజరు ఉన్న మొదటి బ్యాచ్ మహిళలకు ఇటీవల పరీక్షలు నిర్వహించారు. ఇందులో అర్హత సాధించిన వారికి ఉచితంగా కుట్టు మెషీన్లు అందిస్తామని చెప్పుకొచ్చారు. శిక్షణ పొందితే మెషీన్లు ఇస్తారని ఆశతో ఎదురు చూస్తూంటే తమకివేం పరీక్షలంటూ మహిళలు మండిపడుతున్నారు. కేవలం మెషీన్లు ఇవ్వకుండా కాలయాపన చేయడానికే ఇలా సాకులు చెబుతున్నారని మండిపడుతున్నారు. శిక్షణ పూర్తయి ఏడాది గడుస్తున్నా కుట్టు మెషీన్లు ఎందుకివ్వడం లేదో చెప్పాలని, కనీసం ఎప్పుడిస్తారో స్పష్టత ఇవ్వాలని నిలదీస్తున్నారు. అలాగే శిక్షణ ఇచ్చిన సిబ్బందికి సైతం ప్రభుత్వం వేతనాలు ఇవ్వకపోవడం గమనార్హం.
కుట్టుశిక్షణ కేంద్రాల వివరాలు
జిల్లా కేంద్రాలు శిక్షణ
పొందిన వారు
కాకినాడ 50 4,920
తూర్పుగోదావరి 25 2,904
కోనసీమ 29 3,190
పోలవరం 5 566
మొత్తం 104 11,104


