అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీ గోకులం రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు తడిసి ముద్దయింది. గోకులం పైన రెల్లుగడ్డితో నేసిన కప్పు నుంచి నీరు కారిపోవడంతో సప్త గోవులతో బాటు మధ్యలోని శ్రీకృష్ణుడి విగ్రహం కూడా తడిసిపోయింది. రెండేళ్ల క్రితం కప్పుపై తడికలు పేర్చి దానిపై రెల్లు గడ్డి వేశారు. అయితే రత్నగిరిపై తిరుగుతున్న కోతుల కారణంగా రెల్లుగడ్డి ఊడిపోవడంతో లోపలకు వర్షం కారిపోతోంది. దీంతో గోవులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కాగా.. 2007లో దేవదాయశాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా రత్నగిరిపై శ్రీగోకులాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత మిగిలిన దేవస్థానాలలో కూడా ప్రారంభమైనా అన్నవరంలోని శ్రీగోకులం బాగా ప్రాచుర్యం పొందింది. సత్యదేవుని దర్శించుకున్న భక్తులందరూ ఇక్కడకు వచ్చిన గోవులకు పూజలు చేస్తారు. శ్రీగోకులంలో నిత్యం ఉదయం ఏడు గంటల నుంచి గోపూజ నిర్వహిస్తున్నారు. వీటితో బాటు గో సంరక్షణార్థం విరాళాలు స్వీకరిస్తున్నారు. రూ.1,116 నుంచి ఎంత మొత్తమైనా విరాళంగా చెల్లించవచ్చు. గోవులకు మేత పెట్టేందుకు రూ.పదితో పచ్చగడ్డి, తర్వాత దాణాను విక్రయిస్తున్నారు. ఇలా గోపూజ, మే త విక్రయాలు, హుండీ ద్వారా ఏటా రూ.50 లక్షలకు పైగా ఆదాయం వస్తోందని అధికారులు తెలిపారు.
ఫ వర్షం కురిస్తే కారిపోతున్న నీరు
ఫ తడుస్తున్న గోవులు


