అలంపూర్: అత్యవసర పరిస్థితుల్లో డైలీ వచ్చే కాల్స్‌కు తక్షణమే స్పందించాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. అలంపూర్ పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి.. స్టేషన్‌లోని రిసెప్షన్, రైటర్ సెక్షన్, టెక్ టీం, ఎస్‌హెచ్‌ఓ కార్యాలయం, లాకప్, విశ్రాంతి గదులు, వాహనాల పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు. సిబ్బంది యూనిఫాం నిర్వహణతోపాటు జనరల్ డైరీ, బీట్ డ్యూటీ బుక్స్, ఉన్నతాధికారుల సందర్శన రికార్డులు తదితర పత్రాలను పరిశీలించారు. అనంతరం ఎస్పీ సిబ్బందితో సమావేశమై పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రామాలు, బీట్ వ్యవస్థ, పెట్రోల్ వాహనాల విధుల గురించి తెలుసుకున్నారు. గ్రామాల్లో క్రమం తప్పకుండా పర్యటిస్తూ సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, మూఢనమ్మకాలు, బాల్య వివాహాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను విస్తృతంగా నిర్వహించి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ఆదేశించారు. డయల్ 100 కాల్ అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సమస్యలను పరిష్కరించడంతోపాటు ప్రజా ఫిర్యాదులపై ఎలాంటి జాప్యం లేకుండా స్పందించాలన్నారు.
సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ మినహాయించాలి
గద్వాల న్యూటౌన్: న్యాయబద్ధంగా, నోటిఫికేషన్ ప్రకారం నియామకమైన ఉపాధ్యాయులకు 1 ఏప్రిల్ 2010 పూర్వం టెట్ ప్రస్తావన లేదని తపస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవీందర్‌రెడ్డి, నాగరాజు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2010 తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్‌లో టెట్ అర్హత ఆధారంగా నియామకాలు జరుగుతున్నాయని చెప్పారు. 1 ఏప్రిల్ 2010 ఆర్‌టీఈ రూల్స్‌కు అనుగుణంగా ఎన్‌సీటీఈ టెట్ నిబంధనను చేర్చిందన్నారు. ఈ నిబంధనల ఆధారంగానే 2028 ఆగస్టు 31లోపు ఇన్ సర్వీసు ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ఇది దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు ఇబ్బంది కలిగించే అంశం అన్నారు. 1 ఏప్రిల్ 2010 కన్నా ముందు వేసిన నోటిఫికేషన్ ద్వారా నియామకమైన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించేలా తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
523 క్వింటాళ్ల
వేరుశనగ రాక
గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు శుక్రవారం 523 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ.7,611, కనిష్టంగా రూ. 3,599, సరాసరిగా రూ.6,399 ధరలు లభించాయి. అలాగే 33 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ.1,659, కనిష్టంగా రూ. 1,300, సరాసరిగా ధర రూ.1,659 పలికింది.


