సరళాసాగర్ జలాశయం కింద 9 గ్రామాల పరిధిలో 3,200 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో వరి నారు పోసుకోవడానికి రైతులు సిద్ధమవుతున్నారు. మదనాపురం సమీపంలోని ఊకచెట్టు వాగు వద్ద రెండో రైల్వే వంతెన నిర్మాణ పనులు కొనసాగుతుండగా రామన్‌పాడు వెనుక జలాల నుంచి సరళాసాగర్ ప్రాజెక్టుకు నీటిని తరలించే ప్రధాన పైప్‌లైన్‌ను తొలగించాల్సి వచ్చింది. దీంతో సరళాసాగర్ ప్రాజెక్టుకు సాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి పైప్‌లైన్ పనులు త్వరగా పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించడంతో పాటు రూ.49.50 లక్షలు మంజూరు చేశారు. కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటికీ పైప్‌లైన్ ఏర్పాటు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటికిప్పుడు పనులు వేగవంతం చేసినా మరో 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. సమయం దాటిపోతే ఈ ఏడాది వానాకాలం పంటలకు నీరందడం కష్టమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


