అధిక ధరలకు హద్దులేకుండా పోయింది | - | Sakshi
Sakshi News home page

అధిక ధరలకు హద్దులేకుండా పోయింది

Jun 11 2026 8:17 AM | Updated on Jun 11 2026 8:17 AM

గద్వాలన్యూటౌన్‌: బీజేపీ పాలనలో ధరల పెంపునకు హద్దులేకుండా పోయిందని సీపీఐ జాతీయ కమిటీ సభ్యురాలు సురవరం విజయలక్ష్మి ఆరోపించారు. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర ధరలను నిరసిస్తూ.. బుధవారం సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ముందుగా పీజేపీ క్యాంపు నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పాలనలో సామాన్యుడు ధరల భారాలతో నలిగిపోతున్నాడన్నారు. ధరలను విపరీతంగా పెంచుతూ.. కార్పొరేట్‌ శక్తులకు దేశ సంపదను దోచి పెడుతున్నారని విమర్శించారు. నీట్‌ పరీక్ష పేపర్‌ లీకేజీపై నోరు మెదపడం లేదన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం.. నిరుద్యోగుల నడ్డి విరిచిందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ, కార్పొరేట్‌కు కొమ్ము కాస్తున్నారన్నారు. కార్పొరేటర్ల డబ్బుతోనే ఎన్నికల్లో గెలుస్తున్నారని ఆరోపించారు. దేశంలో రూపాయి విలువ పడిపోతున్నా.. పట్టించుకోకుండా సాకులు చెబుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో దేశ ప్రజలంతా ఏకమై బీజేపీని గద్దె దించాలన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్‌ అధికారికి అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, నాయకులు రంగన్న, ఊశన్న, నాగార్జున, రవి, ప్రతాప్‌, ఈశ్వర్‌, వెంకటేశ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement