అమరచింత: చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది. మొదటి విడతలో 50 మంది సభ్యులున్న సంఘాలకు ఈ నెల 12న ఎన్నికలు నిర్వహించేందుకు చేనేత, జౌళిశాఖ అధికారులు ప్రకటన జారీ చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలో చేనేత సహకార సంఘాల్లో ఎన్నికల వేడి రాజుకుంది.
● చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ఏప్రిల్ 4 నుంచి మే నెల 15 వరకు సహకార సంఘాల సభ్యుల ఓటరు జాబితా తయారు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. చేనేత జౌళిశాఖ అధికారులు ఓటరు జాబితా సవరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. అయితే సంఘాల్లో ఎలాంటి అప్పులు లేని సభ్యులు మాత్రమే పోటీ చేసే, ఓటు వేసే హక్కు ఉంటుందని ప్రకటించడంతో ఆశావహులు సంఘాలు, బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను చెల్లించారు. ఈ నెల 12న 9 మంది డైరెక్టర్లను ఎన్నుకోవడంతో పాటు వారిలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షులను ప్రకటిస్తారు. ఈ వ్యవహారమంతా అభ్యర్థికి సభ్యులు చేతులెత్తి ఓటేసే ప్రక్రియతో కొనసాగనుందని అధికారులు తెలిపారు. 100 మంది కంటే ఎక్కువ మంది సభ్యులున్న సంఘాలకు ఇదే నెల చివరి వారంలో ఓటింగ్ విధానంలో ఎన్నికలను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
2013లో చివరిసారి..
రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల ఎన్నికలు 2013, ఫిబ్రవరిలో చివరిసారి జరగగా.. 2018లో వీటి కాల పరిమితి ముగిసింది. ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు జరగలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఎనిమిది ఏళ్ల పాటు పాత పాలకవర్గాల పదవీ కాలన్ని మొత్తం 16 పర్యాయాలు పొడిగించింది. చివరిసారి 2026, మార్చి 9 నుంచి మే నెల 10 వరకు పదవీ కాలం పొడిగించారు. జిల్లాలోని పలు సొసైటీల్లో అక్రమాలు జరిగాయని తేలడంతో పీఏసీఎస్ చట్టం సెక్షన్ 51 కింద అధికారులను పర్సన్ ఇన్‌చార్జ్‌లుగా నియమించారు.
మొదటి దశలో 10 సంఘాలకు...
చేనేత సహకార సంఘాల ఎన్నికలు దశల వారీగా నిర్వహించనున్నారు. మొదటి విడతలో 50 ఓట్ల కంటే తక్కువ ఉన్న సంఘాలకు ఈ నెల 12న నిర్వహించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని 10 సంఘాలకు ఎన్నికలు జరగనుండగా.. చేతులెత్తే పద్ధతిలో 9 మంది డైరెక్టర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అదేరోజు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక ఉండనుంది. నారాయణపేటలోని చేనేత సంఘం, మార్కండేయ మహిళా సంఘం, శ్రీలక్ష్మి సిల్క్స్ సంఘం, ఆదర్శ చేనేత సంఘాలతో పాటు చిన్నజట్రం, కోటకొండ, మద్దూరులోని శ్రీబాలాజీ, పోతిరెడ్డిపల్లిలోని టసర్ ఖాదీ సిల్క్ బోర్డు, గద్వాల జిల్లాలో అనంతపురం పవర్‌లూమ్ సంఘం, నాగర్‌కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి సంఘాలకు మొదటి విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
ఉమ్మడి జిల్లాలో ఇలా..
జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 54 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో కొన్ని సంఘాలు పనిచేస్తుండగా.. మరికొన్ని అప్పుడప్పుడు పని చేస్తున్నాయని, కొన్ని సంఘాలు మూతబడ్డాయని చేనేత, జౌళిశాఖ అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 25 వేల మంది చేనేత కార్మికులు ఉన్నారు.
ఈ నెల 12న నిర్వహణకు ప్రభుత్వం పచ్చజెండా
మొదటి విడతలో
50 మంది సభ్యులున్న సంఘాలకే..
ఓటరు జాబితా సిద్ధం చేసిన అధికారులు
డిఫాల్టర్లు, మృతిచెందిన వారి
ఓటుహక్కు తొలగింపు
ఉమ్మడి జిల్లాలో
54 చేనేత సహకార సంఘాలు


