అయిజ: పట్టణంలో గోదాంల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (ఎన్‌సీసీఎఫ్) అధికారులు వినయ్, యశ్వంత్ తెలిపారు. మంగళవారం జిల్లా సహకారశాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ మహేశ్‌కుమార్‌తో కలిసి పట్టణ సమీపంలో స్థానిక పీఏసీఎస్‌కు కేటాయించిన రెండెకరాల ప్రభుత్వ స్థలాన్ని వారు పరిశీలించి మాట్లాడారు. ప్రస్తుతం రైతులు పండిస్తున్న అన్నిరకాల పంటల కొనుగోళ్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు. ఈ క్రమంలో పంటల నిల్వకు గోదాంల కొరత తీవ్రంగా ఉందన్నారు. అయిజ పీఏసీఎస్‌కు కేటాయించిన స్థలంలో 2,500 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన రెండు గోదాంలు నిర్మించవచ్చని అన్నారు. రూ. 3కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ గోదాంలు ఎఫ్‌సీఐ, గిడ్డంగుల అభివృద్ధి రెగ్యులేటరీ అథారిటీ ప్రమాణాలతో ఉంటాయని తెలిపారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన అనంతరం ఆరు నెలల్లో గోదాంల నిర్మాణం పూర్తిచేసి.. సొసైటీకి అందించే విధంగా కృషిచేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, సీఈఓ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
సామాజిక తెలంగాణే
టీఆర్‌ఎస్ లక్ష్యం
గద్వాలన్యూటౌన్: సామాజిక తెలంగాణనే తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర పరిశీలకుడు ఆర్‌వీఆర్ ప్రసాద్ అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని పాత బస్డాండ్ ప్రాంతంలో టీఆర్‌ఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ఇన్‌చార్జి గొంగళ్ల రంజిత్‌కుమార్‌తో కలిసి ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. అన్ని వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా టీఆర్‌ఎస్ పనిచేస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని.. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ అమరులు, ఉద్యమకారుల ఆశయాలు నెరవేర్చే ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్ అని అన్నారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకగా తమ పార్టీ సమస్యలపై పోరాడుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, విష్ణు, బలరాం నాయుడు, వెంకట్రాములు, కృష్ణ, గుండన్న, గోపాల్, కిష్టన్న, ఆశన్న పాల్గొన్నారు.


