● ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్‌శివకుమార్‌నాయుడు
గద్వాల: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా వివిధ ప్యాకేజీల పరిధిలో సేకరించాల్సిన 534 ఎకరాల్లో ఎలాంటి ఇబ్బందులు లేని భూ సేకరణ ప్రక్రియను 45 రోజుల్లోగా పూర్తిచేయాలని ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ శివకుమార్‌నాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆయన కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌తో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపై ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో భూ సేకరణ ప్రక్రియ ఆలస్యం కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు. గట్టు ఎత్తిపోతల పథకంలో 462 ఎకరాలు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ఫేజ్–2 కింద నిర్మిస్తున్న మల్లమ్మకుంట రిజర్వాయర్ పరిధిలో 567 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందన్నారు. అదేవిధంగా నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో 534 ఎకరాలు సేకరించాల్సి ఉండగా.. ఇందులో కోర్టు కేసులు, సమస్యలు లేని 220 ఎకరాలకు ఈ నెల 15వ తేదీలోగా ప్రిలిమినరీ డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించారు. ఆయా ప్రాజెక్టుల పరిధిలో భూసేకరణ ప్రక్రియ పూర్తయితేనే పెండింగ్ పనులు వేగవంతమవుతాయని ఆయన గుర్తుచేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. భూసేకరణ ప్రక్రియకు సంబంధించి రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైతే ప్రాజెక్టుల ఆవశ్యకతను వివరించి ఒప్పించాలన్నారు. రెవెన్యూ, సర్వే, ఇరిగేషన్‌శాఖల అధికారులు సమన్వయంతో త్వరితగతిన భూసేకరణ ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు. సమావేశంలో ఎస్‌డీసీ కృష్ణ, ఇరిగేషన్‌శాఖ ఎస్‌ఈ రహీముద్దీన్, సర్వే ఏడీ నూకరాజు, ఏఓ భూపాల్‌రెడ్డి, తహసీల్దార్లు ఉన్నారు.


