గద్వాల(గద్వాల క్రైం): నేరస్తుల విషయంలో పోలీసు సిబ్బంది కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షలో ఆయన మాట్లాడా రు. జిల్లాలో శాంతి భద్రతల విషయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో అనుమానిత వ్యక్తులను గుర్తించి పూర్తిస్థాయిలో విచారించాలని తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట నిఘా ఉంచడంతో పాటు చెక్‌పోస్టుల వద్ద ప్రతి గూడ్స్ వాహనం, కంటెయినర్లను తనిఖీ చేయాలని ఆదేశించారు. పోలీస్‌స్టేషన్‌కు సమస్యలపై వచ్చే బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. అనుమతి లేకుండా ఇసుక, మట్టి, రేషన్ బియ్యం, నిషేధిత మత్తు పదార్థాలు, గంజాయి, పేకాట వంటి వాటిని గుర్తించి కట్టడి చేయాలని ఎస్పీ ఆదేశించారు. సిబ్బందిపై బాధితులు ఎవరైనా ఫిర్యాదులు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నమోదైన కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా వీలైనంత త్వరగా కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసి.. నిందితులకు శిక్ష పడేలా వ్యవహరించాలన్నారు. అదే విధంగా భరోసా సెంటర్‌లో బాధితుల సమస్యలను వీలైనంత వరకు పరిష్కరించాలని ఆయన సూచించారు. సమావేశంలో ఏఎస్పీ శంకర్, డీఎస్పీ మొగిలయ్య, సీఐలు శ్రీను, ప్రదీప్‌కుమార్, ఎస్‌ఐలు కళ్యాణ్‌కుమార్, శ్రీకాంత్, శ్రీహరి, నాగశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


