రుణ లక్ష్యం.. నిర్దేశం | - | Sakshi
Sakshi News home page

రుణ లక్ష్యం.. నిర్దేశం

Jun 9 2026 5:42 AM | Updated on Jun 9 2026 5:42 AM

జిల్లాలోని మహిళా సంఘాలకు రూ.272.99 కోట్ల రుణాలు

గ్రామీణ ప్రాంతాల్లో 7,222 ఎస్‌జీహెచ్‌లకు రూ.212.65 కోట్లు

పట్టణ ప్రాంతాల్లో 504 సంఘాలకు రూ.64.34 కోట్లు

ప్రభుత్వ లక్ష్యం మేరకు రుణాలు అందించేందుకు అధికారుల ప్రణాళిక

–8లో u

గద్వాలన్యూటౌన్‌: జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు 2026–27 ఆర్థిక సంవత్సరం బ్యాంకుల ద్వారా అందించే రుణ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల సభ్యులు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు బ్యాంక్‌ లింకేజీ కింద ఇచ్చే రుణ లక్ష్యం గత ఆర్థిక సంవత్సరం నెరవేరింది. ఈ ఏడాది కూడా లక్ష్యానికి అనుగుణంగా రుణాలు అందించేందుకు అధికారులు నెలవారీ ప్రణాళికలు రూపొందించారు.

ఇందిరా మహిళాశక్తితో యూనిట్ల ఏర్పాటు..

స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు బ్యాంకుల ద్వారా గ్రూపు రుణాలు అందిస్తారు. మహిళా సంఘాల వారు నిర్వహించుకునే వ్యాపారాలను సూచిస్తూ.. బ్యాంకు లింకేజీ రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటారు. అర్హులైన సంఘాలకు రూ. 2లక్షల నుంచి రూ. 20లక్షల వరకు రుణాలు అందిస్తున్నారు. అయితే 2024–25లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరా మహిళాశక్తి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద భ్యాంకుల ద్వారా రుణాలు పొందిన మహిళలు వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే వ్యక్తిగత యూనిట్లతో పాటు ప్రధానంగా ఒక సంఘంలో నలుగురు, ఐదుగురితో కలిసి గ్రూప్‌ యూనిట్లు నెలకొల్పుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 2025–26లో మహిళాశక్తి పథకం ద్వారా క్యాంటీన్లు, కిరాణాలు, టైలరింగ్‌, బ్యూటీ పార్లర్లు, పాడి, చీరలు, స్వీట్‌, పచ్చళ్ల దుకాణాలు, అగర్‌బత్తీలు, రోటీ మేకింగ్‌ సెంటర్లు తదితర వాటిని స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసుకున్నారు. 2026–27లో సైతం బ్యాంకు రుణాల ద్వారా ఇందిరా మహిళాశక్తి కింద వివిధ వ్యాపార యూనిట్లను మహిళలు నెలకొల్పుకునేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు.

గతేడాది లక్ష్యానికి మించి..

డీఆర్డీఓ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాలు, మెప్మా ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల నిర్వహణ చూస్తుంటారు. అయితే 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రుణాలు అందించేందుకు గాను రెండు శాఖల అధికారులు అర్హత గల సంఘాల వివరాలను తీసుకున్నారు. ఎంత మొత్తంలో వారికి రుణాలు అందించాలనే దానిపై లెక్కలు వేసి.. ప్రభుత్వానికి నివేదించారు. అధికారులు ఇచ్చిన వివరాల ఆధారంగా ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 7,222 స్వయం సహాయక సంఘాలకు రూ. 212.65కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని 504 సంఘాలకు రూ. 64.34కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించారు. అయితే పట్ణణ, గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలు రుణాలతో ఇందిరా మహిళాశక్తి కింద చిన్న, పెద్ద వ్యాపారాలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రుణ లక్ష్యానికి మించి అందించారు. ఈ ఏడాది సైతం రుణ లక్ష్యం సాధించేందుకు ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే ప్రత్యేక దృష్టిసారించారు.

సద్వినియోగం చేసుకోవాలి..

స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకుల ద్వారా అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలి. తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లించాలి. రుణాలతో వ్యాపారాలు నిర్వహించుకుని ఆర్థికంగా అభివృద్ది సాధించాలి. 206–27 రుణ లక్ష్యం నెరవేరేలా చర్యలు తీసుకుంటున్నాం.

– ముషాహిదాబేగం, డీఆర్డీఓ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement