● నిబంధనల మేరకు పరిహారం చెల్లింపులు
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
గద్వాల/మానవపాడు: జిల్లాలోని నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతల పథకాలతో పాటు మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియలో జిల్లా వెనకబడిందని.. ఈ విషయంపై సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారని గుర్తుచేశారు. తహసీల్దార్లు, సర్వేయర్లు సమన్వయం చేసుకుని ప్రత్యేక బృందాలుగా ఏర్పడి భూసేకరణ ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. భూసేకరణ అవార్డు పాస్ చేసిన వెంటనే రైతులకు ప్రభుత్వ నిబంధనల మేరకు పరిహారం చెల్లింపులు పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, ఎస్‌డీసీ కృష్ణ, సర్వే ఏడీ నూకరాజు, ఇరిగేషన్ ఽఅధికారి సంజీవ్ ప్రసాద్ తదితరులు ఉన్నారు.


