ఇటీవల చోటుచేసుకున్న ఘటనలు
వైద్యో నారాయణో.. ప్రాణాలు ‘హరీ’!
జిల్లా ఆస్పత్రిలో తరచుగా వికటిస్తున్న వైద్యం
సోమవారం శ్రీ 8 శ్రీ జూన్ శ్రీ 2026
గద్వాల క్రైం: వైద్యో నారాయణో హరి.. వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం. తల్లిదండ్రులు జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మనిస్తారు. ఎవరికి ఎలాంటి జ బ్బు చేసినా ఆస్పత్రిని ఆశ్రయించి.. తగిన చికిత్సతో నయం చేయాలని వైద్యులను వేడుకుంటాం. అయితే కొందరు వైద్యులు వ్యవహరిస్తున్న తీరు, నిర్లక్ష్యం కారణంగా రోగుల ప్రాణాల గాలిలో దీపంలా మారుతున్నాయి. అందులో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి నిదర్శనంగా నిలుస్తోంది. వైద్యం కోసం వస్తే ప్రాణాలు కోల్పోవాల్సిందేనని బాధిత కుటుంబాలు గుండెలు బాదుకుంటున్నాయి. నడిగడ్డ వైద్యులంటేనే వామ్మో అంటున్నారు. జిల్లా ప్రభు త్వ ఆస్పత్రిలో గర్భిణులు ప్రసవం కోసం వస్తే శిశువు లేదా తల్లి మృతిచెందడం.. కడుపునొప్పి భరించలేక యవతి వస్తే అపెండిక్స్‌గా గుర్తించి.. చికిత్స అందించినా మృతిచెందడం వంటి ఘటనలతో వైద్యులు వివాదాల్లో చిక్కుకుంటున్నారు.
అనుభవం లేని వైద్యులతో తప్పిదాలు..
జిల్లా ఆస్పత్రిలో రోగులకు వివిధ చికిత్సలు చేయాల్సిన తరుణంలో అనుభవం కలిగిన వైద్యుల పర్యవేక్షణ కరువైందని తెలుస్తోంది. ప్రధానంగా ప్రభుత్వ వైద్యుడు మేజర్ చికిత్సలు చేయాల్సి ఉండగా.. కాంట్రాక్టు పద్ధతిన కొలువు చేపట్టిన వైద్యుడు మేజర్ చికిత్సలు చేయడంతోనే పలు తప్పిదాలు చోటు చేసుకుంటున్నాయని కొందరు వైద్యులు బహిరంగంగా చెబుతున్నారు. మరోవైపు మెడికల్ కళాశాలకు అనుబంధంగా జిల్లా ఆస్పత్రి ఉండటం.. ప్రాక్టిస్ వైద్యులతో చికిత్సలు చేయించడం కూడా సమస్యగా మారిందని తెలుస్తోంది. అయితే అనుభవజ్ఞులైన వైద్యులు విధుల్లో అలసత్వంగా వ్యవహరించడం.. పైగా వారిపై ఫిర్యాదు లు చేసినా చర్యలు లేకపోవడం కొసమెరుపు.
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి
గాలిలో దీపంలా
మారుతున్న రోగుల ప్రాణాలు
నడిగడ్డ వైద్యులంటేనే
హడలెత్తుతున్న జనం
తాజాగా శస్త్రచికిత్స వికటించి
బాలిక మృత్యువాత
గత మార్చి 10న అయిజ మండలం మేడికొండకు చెందిన ఓ గర్భిణి ప్రసవం కోసం జిల్లా ఆస్పత్రికి వచ్చింది. ప్రసవ సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కడుపులోనే శిశువు మృతిచెందింది. ఈ ఘటనపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు.
మే 27న మానవపాడు మండలానికి చెందిన ఓ గర్భిణి ప్రసవం కోసం జిల్లా ఆస్పత్రికి రాగా.. వైద్యులు పరీక్షించి కాన్పు చేస్తామని కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే ప్రసవం తర్వాత శిశువు మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతిచెందిందని బాధిత కుటుంబ సభ్యులు వైద్యులతో గొడవకు దిగారు.
తాజాగా రెండు రోజుల క్రితం ఎర్రవల్లికి చెందిన ఇందు (17)కు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు పరీక్షించి.. బాలికకు అపెండిక్స్‌గా గుర్తించారు. ఈ క్రమంలోనే శస్త్రచికిత్స చేయాల్సిందిగా కుటుంబ సభ్యులకు వివరించి.. మరుసటి రోజు మధ్యాహ్నం శస్త్రచికిత్స చేశారు. అయితే చికిత్స అనంతరం బాలిక మృతిచెందింది. విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేసి.. హుటాహుటినా అంబులెన్స్ ద్వారా స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించారు. జిల్లా ఆస్పత్రిలో తరచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది.


