కార్పొరేట్‌కు దీటుగా..! | - | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌కు దీటుగా..!

Jun 8 2026 6:54 AM | Updated on Jun 8 2026 6:54 AM

సద్వినియోగం చేసుకోవాలి..

నారాయణపేట రూరల్‌: ఐదేళ్లలోపు చిన్నారులకు సైతం ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాలయాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే ఆటపాటలతో చదువుపై ఆసక్తి పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గతేడాది ప్రీ ప్రైమరీ పాఠశాలలు ప్రారంభించింది. చిన్నారుల మనోవికాస అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేసి పాఠశాల విద్యాశాఖ, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల సమన్వయంతో ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించింది. గతేడాది కార్యాచరణలో భాగంగా పాఠశాలలకు ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు అనుమతులు మంజూరు చేసింది.

సత్ఫలితాలతో ముందుకు..

గతేడాది ప్రారంభించిన ప్రీ ప్రైమరీ పాఠశాలలు సత్ఫలితాలు ఇవ్వడంతో 2026–27 విద్యా సంవత్సరంలో మరిన్ని పాఠశాలలకు విస్తరించాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు కొత్తగా మంజూరు చేసిన పాఠశాలల్లో అవసరమైన సౌకర్యాలు కల్పిస్తోంది. ఇప్పటికే ఒక్కో పాఠశాలకు రూ.లక్ష మంజూరు చేసి సామగ్రి కొనుగోలు, పెయింటింగ్‌ కోసం వినియోగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మొదటి విడత 94 పాఠశాలల్లో ప్రారంభించగా.. తాజాగా వాటి సంఖ్య మూడింతలు చేసి 292 పాఠశాలలకు అనుమతినిచ్చింది. దీంతో ఇప్పటి వరకు 386 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య అందనుంది.

ప్రవేశాలు ఇలా..

వచ్చే ఏడాది ఒకటో తరగతిలో చేరడానికి అర్హులైన పిల్లలను 2026–27 విద్యా సంవత్సరంలో ప్రీ ప్రైమరీ విభాగంలో చేర్చుకోవాలి. ఆయా చిన్నారులను పాఠశాలలకు సిద్ధం చేయడం, పూర్వ ప్రాథమిక విద్య అందించడం ముఖ్య ఉద్దేశం. వయస్సు, నివాస ధ్రువీకరణతో సహా అవసరమైన అన్ని పత్రాలను సేకరించి ప్రవేశాలు కల్పించాలి. విద్యాహక్కు చట్టం ప్రకారం అట్టడుగు వర్గాల పిల్లలు, ప్రత్యేక అవసరాల పిల్లలను మొదట చేర్చుకుంటారు. ప్రీ ప్రైమరీ విభాగానికి ప్రత్యేక గదిని కేటాయిస్తారు. అందులో పిల్లలకు అవసరమైన ఫర్నీచర్‌, వాల్‌ పెయింటింగ్‌, సామగ్రి తగిన వాటిని సమకూరుస్తారు. సరైన వెలుతురు, ఇండోర్‌, అవుట్‌ డోర్‌ ఆట వస్తువులు, నిద్రించడానికి ప్రత్యేక స్థలం ఉండేలా చర్యలు తీసుకున్నారు.

పక్కాగా పాఠ్య ప్రణాళిక..

పూర్తిగా ఎన్‌సీఈఆర్టీ రూపొందించిన పాఠ్య ప్రణాళికలను అనుసరిస్తారు. ఇది నేషనల్‌ కరికులం ఫ్రేమ్‌ వర్క్‌ ఫర్‌ ది ఫౌండేషన్‌ స్టేజ్‌తో అనుసంధానం చేసి ఉంటుంది. బోధనకు నియమించిన ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణనిచ్చారు. ప్రీ ప్రైమరీ విభాగాల్లోని పిల్లలందరికీ మధ్యాహ్న భోజనం, అల్పాహారం అందిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రం నుంచి వచ్చే అల్పాహారం సైతం అదనంగా ఇస్తున్నారు. సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా పిల్లల రక్షణకు చైల్డ్‌ రైడ్‌ ప్రొడక్షన్‌ పాలసీని పకడ్బందీగా అమలు చేస్తారు. ప్రీ ప్రైమరీ విభాగాలను ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు ప్రతిరోజు పర్యవేక్షించాలి. పిల్లల పురోగతిని సమీక్షించడానికి క్రమం తప్పకుండా పేరెంట్స్‌– టీచర్స్‌ సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే స్కూల్‌ ఎడ్యుకేషన్‌, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ, ఆరోగ్యశాఖ విభాగ అధికారుల ఉమ్మడి తనిఖీలతో కలిసి ఏడాదిలో రెండుసార్లు సమావేశాలు నిర్వహిస్తున్నారు.

జిల్లాల వారీగా ప్రీ ప్రైమరీ పాఠశాలల

మంజూరు ఇలా..

జిల్లా పాఠశాలలు

మహబూబ్‌నగర్‌ 85

నాగర్‌కర్నూల్‌ 74

నారాయణపేట 44

వనపర్తి 48

జోగుళాంబ గద్వాల 41

ప్రభుత్వం పేద, మధ్య తరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలకు డబ్బులు వెచ్చించకుండా ప్రీ ప్రైమరీ తరగతులు ఏర్పాటు చేసింది. ప్రత్యేక నిధులు కేటాయించి తరగతి గదులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతోపాటు అదనంగా బోధకులు, ఆయాలను కేటాయించింది. విడతల వారీగా అన్ని గ్రామాలకు విస్తరించి వంద శాతం ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఉండేలా చర్యలు తీసుకుంటుంది.

– విద్యాసాగర్‌, జిల్లా అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి, నారాయణపేట

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ

పైమరీ తరగతుల నిర్వహణ

ఉమ్మడి జిల్లాలో రెండో విడతలో

292 పాఠశాలలు ఎంపిక

తరగతి గది, సామగ్రి కొనుగోలుకు నిధులు మంజూరు

ఐదేళ్లలోపు చిన్నారులకు అవకాశం

ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల

నియామకానికి దరఖాస్తులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement