తాజాగా ఇందు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతురాలి తల్లిదండ్రులు గోపాల్, మద్దమ్మ, ఇతర కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ జిల్లా కేంద్రంలో ఆందోళనకు దిగారు. ఆదివారం జిల్లా ఆస్పత్రి ఎదుట ప్రధాన రహదారి (ఫ్లైఓవర్ బ్రిడ్జి) వద్ద బైఠాయించి ధర్నా చేపట్టగా.. బీఆర్‌ఎస్, ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు మద్దతు ప్రకటించి పాల్గొన్నారు. సమాచారం అందుకున్న ఏఎస్పీ శంకర్, ఆర్డీఓ శ్రీనివాసులు అక్కడికి చేరుకొని బాధిత కుటుంబసభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. బాలికకు శస్త్రచికిత్స చేసిన వైద్యులను శాశ్వతంగా విధుల నుంచి తప్పించి.. మెడికల్ కౌన్సిల్‌లో లైసెన్స్ రద్దు చేయడంతో పాటు మృతురాలి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు, వ్యవసాయ భూమి ఇవ్వాలని, ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేరిస్తేనే ఆందోళన విరమిస్తామని తేల్చిచెప్పారు. 2గంటలకు పైగా ఆందోళన కొనసాగడంతో పోలీసులు ముందుగా మద్దతు తెలిపిన ఆయా పార్టీల నాయకులను అతికష్టం మీద అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో మరోసారి బాధిత కుటుంబ సభ్యులతో ఆర్డీఓ చర్చలు జరిపారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా, పోలీసులు అరెస్టు చేసిన నాయకులను ధరూర్ స్టేషన్‌కు తరలించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా, ఆందోళనకారులను అరెస్టుచేసే సమయంలో రూరల్ ఎస్‌ఐ శ్రీకాంత్ చేతికి రక్తగాయమైంది. ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా గద్వాల సీఐ శ్రీను, ఎస్‌ఐలు మల్లేష్, శ్రీహరి, నందికర్, శ్రీనివాస్‌గౌడ్, కుమార్‌తో పాటు 100 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని
ఆందోళనకు దిగిన నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు


