నైతిక విలువలకు మనదేశంలో ప్రపంచంలోనే ఎంతో ప్రసిద్ధి. అందుకే మన దేశం నుంచి అనాథ చిన్నారులను దత్తత తీసుకొని వారి బాగోగులు చూడడంతో పాటు వారిపై ప్రేమాభిమానం కనబరచడం ఇందుకు నిదర్శనం. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఇప్పటి వరకు ఆయా దేశాలకు చెందిన పలువురు దంపతులు 32 మంది అనాథ చిన్నారులను చేరదీశారు. రూ.కోట్లు ఆస్తులు కలిగిన దంపతుల చేతిలో ఇక్కడి అనాథ పిల్లలు పెరగడం విశేషం. 2014 సంవత్సరం నుంచి విదేశీ దంపతులు ఇక్కడికి తరచూ రావడం.. చిన్నారులను దత్తత తీసుకోవడం అధికారికంగా తమ దేశాలకు వెళ్లి పిల్లలను పెంచుకోవడం విశేషం. మాతృత్వం కోసం పరితపిస్తున్న తల్లిదండ్రులు తమ ప్రేమకు హద్దులు లేవని నిరూపిస్తున్నారు. తల్లి మాధుర్యం కోసం పరితపిస్తున్న మహిళల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండగా.. సంతానం కోసం ఆస్పత్రులు.. సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరుగుతున్న దంపతులు కోకొల్లలు. వీరి మాతృత్వం అనుభూతిని తీర్చడానికి జిల్లాకేంద్రంలోని శిశుగృహ కేంద్రం ఎంతో కృషి చేస్తుందనడంలో సందేహం లేదు. శిశుగృహలోని చిన్నారులను ఎంతోమందికి చట్టబద్ధంగా దత్తత ఇస్తున్నారు. అమెరికాకు 17 మంది, స్పెయిన్‌కు ఐదుగురు, ఇటలీకి ముగ్గురు, స్వీడన్‌కు ముగ్గురు, మాల్టాకు ఇద్దరు, ఫిన్లాండ్, కెనడాకు ఒక్కొక్కరు చొప్పున దత్తత ఇచ్చారు.
అమ్మ అనే పదంలోని తీయదనం.. అభిమానం వెల కట్టలేనిది.. తొమ్మిది నెలలు మోసి కనిపెంచిన అమ్మకు ఉన్న గొప్పతనం అటువంటిది. అయితే ఏ కారణం ఏదైనప్పటికీ.. అమ్మ ప్రేమకు దూరమైన శిశువుల దుస్థితిపై అంచనా వేయడం అసాధ్యం. అయితే తల్లిదండ్రుల ఆలనాపాలనా కరువైన శిశువులకు మేమున్నామంటూ ప్రభుత్వం ముందుకొచ్చి శిశు సంరక్షణ బాధ్యత నిర్వహిస్తుంది. ఈ మేరకు మహబూబ్‌నగర్‌లోని ఐసీడీఎస్ శిశుగృహ అనాథ శిశువులను అక్కున చేర్చుకుంటూ.. అండగా నిలుస్తోంది. దీంతోపాటు సంతానానికి నోచుకోని దంపతులకు ఆ చిన్నారులను దత్తత ఇస్తూ వారి బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తోంది. – మహబూబ్‌నగర్ రూరల్
మహబూబ్‌నగర్‌లోని
శిశుగృహలో చిన్నారులు (ఫైల్)
అనాథ బాలలను అక్కున చేర్చుకుంటున్న ఐసీడీఎస్ శిశుగృహ
పాలమూరు శిశువులను దత్తత తీసుకున్న విదేశీయులు
గడిచిన 16 ఏళ్లలో 32 మందిని చేరదీసిన విదేశీ దంపతులు
సులువైన పద్ధతులు ఉండటంతో ఆసక్తి చూపుతున్న వైనం


