ధరూరు/ అచ్చంపేట: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్‌ఫ్లో పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. గత వారం రోజులుగా స్థానికంగా కురుస్తున్న వర్షాల ఆధారంగా ప్రాజెక్టుకు శనివారం సాయంత్రం 4,505 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. దీంతో నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750 క్యూసెక్కులు వదలగా.. మరో 40 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 2.740 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇప్పటి వరకు ప్రాజెక్టులో దాదాపు 2.5 టీఎంసీల నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. దిగువనున్న శ్రీశైలం జలాశయానికి ఎలాంటి ఇన్‌ఫ్లో రావడం లేదు. ప్రస్తుతం ప్రాజెక్టులో 818 అడుగుల వద్ద 39 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు సంబంధిత అధికారులు చెప్పారు.
గ్రామసభలతో సమగ్రాభివృద్ధి
ఇటిక్యాల: గ్రామసభలతో పంచాయతీల్లో సమగ్రాభివృద్ధి సాధ్యమని డివిజినల్ పంచాయతీ అధికారి ప్రవీణ్‌కుమార్ అన్నారు. శనివారం మండలంలోని చాగాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొని ప్రజలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ, వార్డుసభలు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే ముఖ్య వేదికలన్నారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై సయగ్ర వివరాలు తెలియజేసి ప్రజలు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్రంలో సుపరిపాలన పరిమితులు నామినేషన్‌లో చాగాపురం గ్రామ పంచాయతీ ఉందని రాష్ట్ర బృందం ప్రత్యేకంగా సందర్శించి క్షేత్రస్థాయిలో మునుపటి పరిస్థితి, ఇప్పటి మార్పులకు గల తేడాలను పరిశీలించడం జరుగుతందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాఘవ, ఏపీఓ సునీల్, సర్పంచ్ సావిత్రి, పంచాయతీ కార్యదర్శి రవి తదితరులు పాల్గొన్నారు.
ఆరుగురు ఆర్టీసీ
డిపో మేనేజర్ల బదిలీ
నారాయణపేట రూరల్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆరుగురు ఆర్టీసీ డిపో మేనేజర్లను బదిలీ చేస్తూ సంస్థ చీఫ్ పర్సనల్ మేనేజర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నారాయణపేట డీఎం టి.లావణ్య హైదరాబాద్‌లోని హయత్‌నగర్ డిపో–1కు బదిలీ కాగా.. ఆమె స్థానంలో హెడ్‌ఆఫీస్‌లోని ఏటీఎం కార్గో ఇన్‌చార్జి డీఎన్ రాజన్‌ను కేటాయించారు. అలాగే షాద్‌నగర్ డీఎం ఉషను జనగాంకు బదిలీ చేయగా.. ఆమె స్థానంలో హైదరాబాద్ డిపో–2 నుంచి కరుణశ్రీ రానున్నారు. అచ్చంపేట డీఎం పీఎండీ ప్రసాద్ హయత్‌నగర్ డిపో–2కు బదిలీ కాగా.. ఆయన స్థానంలో డిప్యూటీ ఈ–ఎలక్ట్రికల్ హెచ్‌ఆర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ను కేటాయించారు. గద్వాల డీఎం సునీతను కూకట్‌పల్లి డిపోకు బదిలీ చేయగా.. ఆమె స్థానంలో రాణిగంజ్ డిపో నుంచి శ్రీధర్ వస్తున్నారు. కొల్లాపూర్ డిపో మేనేజర్ ఉమాశంకర్‌గౌడ్‌ను ఐటీ డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేయగా.. ఆయన స్థానంలో వరంగల్ బస్టాండ్ ఏటిఎంగా విధులు నిర్వహిస్తున్న మల్లేశ్వరయ్యను కేటాయించారు. కల్వకుర్తి డీఎం సుహాసినిని ఇల్లందు డిపోకు కేటాయించగా.. ఆమె స్థానంలో ఎవరినీ నియమించలేదు.
218 క్వింటాళ్ల వేరుశనగ రాక
గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు శనివారం 218 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడి వచ్చింది. కాగా క్వింటాల్ గరిష్టంగా రూ.6,489, కనిష్టంగా రూ. 5,169, సరాసరిగా రూ.5,469 ధరలు లభించాయి. అలాగే 4 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. సరాసరిగా రూ.2,426 ఒకే ధర పలికింది.


