గద్వాల న్యూటౌన్: నీట్–2026 పునఃపరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలంగాణ ఇన్‌చార్జి అభిషేక్ సింగ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు అన్నారు. శనివారం వారు ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీసీ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడి ఉందన్నారు. గతంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈసారి పరీక్ష నిర్వహణలో గోప్యత, భద్రత, పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పశ్నపత్రాలు భద్రపరిచే ప్రక్రియ, పరీక్ష కేంద్రాల నిర్వహణ తదితర అంశాల్లో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ పరికరాలు, విద్యుత్, తాగునీరు, వైద్య సదుపాయాలు ముందుగానే ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం సీఎస్ రామకృష్ణరావు మాట్లాడుతూ రబీ వరి ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ స్పందిస్తూ జిల్లాలో నీట్‌ను సజావుగా నిర్వహించాలని, ఇందుకోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ నెల 9న మహిళా సంఘాలకు హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగే బస్సుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా నుంచి బయలుదేరే సభ్యులకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా మహిళా సమాఖ్య తరపున ఎలక్ట్రికల్ స్కూటీలు, ఆటో, సైకిళ్లు కొనుగోలు చేసి గట్టు మండలంలోని మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగరావు, డీఆర్‌డీఓ ముషాహిదాబేగం, ఏపీడీ శ్రీనివాస్, డీఏఓ వీరప్ప, పౌరసరఫరాల శాఖాధికారి స్వామికుమార్, నీట్ సిటీ కోఆర్డినేటర్ దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


