అన్నదాతలకు ఊరట | - | Sakshi
Sakshi News home page

అన్నదాతలకు ఊరట

Jun 6 2026 1:17 AM | Updated on Jun 6 2026 1:17 AM

పంటల మద్దతు ధరలు పెంచిన ప్రభుత్వం

అత్యధికంగా పత్తిపై రూ.557.. అత్యల్పంగా మొక్కజొన్నపై రూ.10 పెంపు..

సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రైతుల వేడుకోలు

పంట రకం 2025– 26 2026– 27

వరి(సాధారణం) 2,369 2,441

వరి (ఏ–గ్రేడ్‌) 2,389 2,461

జొన్న (హైబ్రీడ్‌) 3,699 4,023

జొన్న (ఎం–35) 3,749 4,073

కంది 8,000 8,450

వేరుశనగ 7,263 7,517

మొక్కజొన్న 2,400 2,410

పత్తి (24.5– 7,710 8,267

25.5 మి.మీ.,)

పత్తి (29.5– 8,110 8,667

30.5 మి.మీ.,)

గద్వాల వ్యవసాయం: అన్నదాతలకు కాసింత ఊరట లభించింది. కేంద్రం ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం వివిధ రకాల పంటల మద్దతు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2026– 27 ఆర్థిక సంవత్సరానికి పెంచిన మద్దతు ధరలు అమలు చేయాలని ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయి. అయితే మద్దతు ధర లు పెంచిన ప్రభుత్వం.. ఏటా సకాలంలో కొనుగోలు కేంద్రాలు కూడా సకాలంలో ప్రారంభించి.. ధాన్యం సేకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల రైతులు దళారులకు ధాన్యం విక్రయించి నష్టపోకుండా.. ప్రభుత్వానికి అమ్మి లాభపడతారని అభిప్రాయపడుతున్నారు.

దళారులకు విక్రయించి నష్టాలు..

ఏటా పంట మద్దతు ధరలు కొంత పెరుగుతున్నప్పటికీ.. పంట ఉత్పత్తులు చేతికి వచ్చిన వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావడం లేదు. దీంతో చాలామంది రైతులు తక్కువ ధరలకు దళారులకు విక్రయిస్తూ నష్టపోతున్నారు. వానాకాలం సీజన్‌లో రైతులు ఎక్కువగా కంది పంటను జూన్‌లో మొదలు పెడతారు. డిసెంబర్‌ చివరి వారం నాటికి పంట చేతికి వస్తుంది. అయితే కొనుగోలు కేంద్రాలు ఫిబ్రవరి మొదటి వారంలో ఏర్పాటు చేస్తున్నారు. 2025– 26లో కంది మద్దతు ధర రూ.8 వేలు ఉండగా.. కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ఏర్పాటు చేయడంతో వేలాది మంది రైతులు రూ.6,500 నుంచి రూ.7 వేల వరకు మాత్రమే విక్రయించి నష్టపోయారు. మొక్కజొన్న రైతులు అదే పరిస్థితి ఎదుర్కొన్నారు. మద్దతు ధర రూ.2,400 ఉండగా.. చాలామంది రూ.1,700 నుంచి రూ.1,800లకు దళారులకు విక్రయించారు. పత్తి రైతులు సైతం రూ.8,110 మద్దతు ధర ఉండగా.. రూ.7200 నుంచి రూ.7500కే విక్రయించారు. ఇవన్నీ కూడా సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్లే జరిగాయి. కొనుగోలు కేంద్రాలను సకాలంలో ప్రారంభిస్తేనే రైతులకు కాస్త ఆర్థిక ప్రయోజనం ఉంటుంది.

● జొన్న పంట సాగు తక్కువగా ఉంటుందని ఏటా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయ డం లేదు. వేరుశనగ సాగు ఎక్కువగా ఉంటున్నప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు. చేసేది లేక మార్కెట్‌ యార్డుల లో వ్యాపారులు ఇచ్చే ధరలనే రైతులు పొందుతున్నారు. మద్దతు ధరలు ఉండే ప్రతి పంటకు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడే రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.

గట్టు శివారులో పత్తి విత్తనాలు వేసేందుకు

ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతున్న రైతు

పెంచిన మద్దతు ధరలు ఇలా.. (క్వింటాకు.. రూ.లలో..)

ఏటా పెంపుతో మేలు..

వ్యవసాయం చేయడం అంటే ఏటా రైతులకు కత్తి మీద సామె. ఏటేటా పంటల పెట్టుబడులు పెరుగుతుండటంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అందిన కాడ అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి వాతావరణం సైతం అనుకూలించి.. పంట ఉత్పత్తులు చేతికి వచ్చిన తర్వాత మద్దతు ధరలు లభించడం లేదు. కష్టించి పండించిన పంటలకు సరైన ధరలు రాక రైతులు ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు. ప్రభుత్వం ఏటా పంటల మద్దతు ధరలు పెంచుతుండటం కొంతమేలు చేస్తోంది. 2026– 27 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల పంట మద్దతు ధరలను పెంచింది. గతేడాదితో పోల్చితే క్వింటా వరిపై రూ.72, జొన్న రూ.324, కంది రూ.450, వేరుశనగ రూ.254, మొక్కజొన్న రూ.10, పత్తిపై రూ.557 పెంచింది. ప్రస్తుతం పెంచిన ధరలు రైతులకు కాస్త ఊరటనిచ్చాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement